ఖతార్‌లో 8మందికి మరణశిక్ష కేసు.. బాధితులతో భారత రాయబారి భేటీ

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష కేసు, ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు వంటి పలు అంశాలపై విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. 

Published : 07 Dec 2023 18:27 IST

దిల్లీ: గూఢచర్యం(Espionage) ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు మరణశిక్ష (Death Sentence) విధించిన విషయం తెలిసిందే. వారిని డిసెంబర్ మూడో తేదీన(ఆదివారం) ఖతార్‌లోని భారత రాయబారి కలిశారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు.

ఈ మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ఖతార్‌ కోర్టులో భారత ప్రభుత్వం అప్పీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఈ కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణ జరిగింది. మేం ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. వారికి న్యాయపరమైన, దౌత్యపరమైన సహకారం కొనసాగుతుంది. డిసెంబర్‌ మూడున మన రాయబారి వారిని కలిశారు’ అని బాగ్చి వెల్లడించారు.  కాప్‌ సదస్సులో భాగంగా ఇటీవల దుబాయ్‌ వెళ్లిన ప్రధాని మోదీ(Modi).. ఖతార్‌ పాలకుడు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం గురించి చర్చ జరిగిందని బాగ్చి తెలిపారు. 

పన్నూ బెదిరింపులు తీవ్రంగా పరిగణిస్తున్నాం: భారత్‌

డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ‘ఆ బెదిరింపులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారాన్ని అమెరికా, కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఒక అంశంపై మీడియా కవరేజీని కోరుకుంటారు. అలాంటి బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిపై భారత ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకుంటాయి’ అని బాగ్చి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు