Drugs Bust: స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించిన భారతనేవీ.. గుజరాత్‌ తీరంలో 3,300 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం

భారతనౌకాదళం (Indian Navy) భారీస్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరోతో ఈ సంయుక్త ఆపరేషన్‌ను నిర్వహించింది.

Published : 28 Feb 2024 11:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ రాకెట్‌ను భారత నౌకాదళం (Indian Navy) ఛేదించింది. నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(NCB)తో జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా 3,300 కేజీల మాదకద్రవ్యాల (drugs)ను స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్‌ చేసింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.

మంగళవారం అనుమానాస్పదంగా భారత జలాల్లోకి ప్రవేశించిన ఒక చిన్నపాటి నౌకను గుర్తించిన అధికారులు వెంటనే దానిని ముట్టడించారు. దాని నుంచి 3089 కేజీల చరాస్‌, 158 కేజీల మెథామెఫ్తమైన్‌, 25 కేజీల మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారంతా పాకిస్థాన్‌ జాతీయులు. ఆ మేరకు నౌకాదళం ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం దాదాపు రూ.2,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, దిల్లీలో భారీ ఎత్తున మ్యావ్‌ మ్యావ్‌ (మెఫెడ్రిన్) అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. పుణే నగరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని షోలాపుర్‌ వద్ద కుర్‌కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్‌ ప్లాంట్‌లో 700 కేజీల డ్రగ్‌ను సీజ్‌ చేశారు. మరోవైపు దిల్లీలో దాడులు నిర్వహించి 400 కేజీలను పట్టుకొన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని