India-Canada: కెనడాలో భారత కమ్యూనిటీకి బెదిరింపు కాల్స్.. స్పందించిన భారత్‌

భారత్‌-కెనడా(India-Canada) మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న వేళ .. మరో అంశం వెలుగులోకి వస్తోంది. అక్కడి భారతీయ కమ్యూనిటీకి బెదిరింపు కాల్స్‌ వస్తున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.   

Updated : 05 Jan 2024 18:00 IST

దిల్లీ: కెనడా(Canada)లోని భారత జాతీయులకు(Indians) కొన్ని వారాలుగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తూ దుండగులు ఈ కాల్స్‌ చేయడంపై భారత్‌ స్పందించింది. ఇది ఆందోళనకర అంశమని పేర్కొంది.

‘కెనడాలోని పౌరులు.. మరీ ముఖ్యంగా భారత జాతీయులకు దోపిడీ కాల్స్(Extortion Calls) రావడం ఆందోళన కలిగించే అంశం. భారత్‌-కెనడా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇదివరకు ఒక ఆలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై కెనడా పోలీసులు విచారణ జరిపి, మతిస్థిమితం లేని వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటన విడుదల చేశారు. కానీ ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ అన్నారు.

ఈ దోపిడీ కాల్స్‌ కథనాల వేళ అక్కడి అధికారులు విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇండో-కెనడియన్ కమ్యూనిటీ నిర్వహిస్తోన్న వ్యాపార సంస్థలకు ఈ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ తరహా తొమ్మిది ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది.

‘ఇందులో మేం చేసేదేమీ లేదు: సుప్రీంకోర్టు’

గత ఏడాది జూన్‌లో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్‌ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులను కెనడా పోలీసులు (Canada Police) అతి త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని