ఇందులో మేం చేసేదేమీ లేదు: సుప్రీంకోర్టు

ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అరెస్టై చెక్‌ రిపబ్లిక్‌ జైలులో మగ్గుతున్న భారతీయుడు నిఖిల్‌ గుప్తా దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Published : 05 Jan 2024 05:23 IST

కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
పన్నూ హత్యకు కుట్ర కేసులో అరెస్టైన భారతీయుడి పిటిషన్‌పై వ్యాఖ్యలు

దిల్లీ: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అరెస్టై చెక్‌ రిపబ్లిక్‌ జైలులో మగ్గుతున్న భారతీయుడు నిఖిల్‌ గుప్తా దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది చాలా సున్నితమైన అంశమని, ఇందులో అంతర్జాతీయ చట్టాలు ముడిపడి ఉన్నాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇందులో మేం చేసేదేమీ లేదు. వియన్నా ఒడంబడిక ప్రకారం కాన్సులర్‌ యాక్సెస్‌ హక్కు మీకు ఉంది. దాన్ని మీరు ఇప్పటికే తీసుకున్నారు’’ అని తెలిపింది. ఇది మానవ హక్కుల అంశమని, తమకు భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి సాయం లభించడం లేదని గుప్తా తరఫున న్యాయవాది తెలిపారు. తమ పిటిషన్‌ను వినతిపత్రంగా తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ విషయంలో తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. దీనిపై భారత ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్‌ సుపారీ ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. చెక్‌ అధికారులు కూడా.. అమెరికా సూచనల మేరకే తాము గుప్తాను అరెస్టు చేసినట్లు ధ్రువీకరించారు. వ్యాపార, విహార యాత్ర కోసం చెక్‌ రిపబ్లిక్‌ వెళ్లిన తనను గతేడాది జూన్‌ 30న విమానాశ్రయంలో అరెస్టు చేశారని గుప్తా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని