Jaishankar: అప్పట్లోనే 38 వేల చ.కి.మీ. భూమిని కోల్పోయాం - జైశంకర్‌

చైనా, పాకిస్థాన్‌ (Pakistan) మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్‌ సంబంధాలు గతంతో పోలిస్తే మరింత మెరుగయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు.

Published : 05 Apr 2024 00:05 IST

తిరువనంతపురం: చైనా, పాకిస్థాన్‌ (Pakistan) మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్‌ సంబంధాలు గతంతో పోలిస్తే మరింత మెరుగయ్యాయని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. తిరువనంతపురంలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో భారత్‌ దౌత్య సంబంధాలపై మాట్లాడిన ఆయన చైనా (China)తో భారత్‌ సంబంధాలు సవాళ్లతో కూడుకున్నదన్నారు. అయినప్పటికీ దేశ ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యం, విశ్వాసం మనకు ఉందన్నారు.

చైనా, పాక్‌ మినహా..

‘‘ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంతంతమాత్రమే. పాకిస్థాన్‌తోనూ అంతే. ఈ రెండింటినీ మినహాయిస్తే.. బంగ్లాదేశ్‌ సహా ఇతర పొరుగుదేశాలతో భారత్‌ సంబంధాలు గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. దేశ ప్రయోజనాలను ముందుకుతీసుకెళ్లగల, రక్షించుకోగల సామర్థ్యం, విశ్వాసం మనకు ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మేమూ పోటీ పడతాం’ అని జైశంకర్‌ పేర్కొన్నారు. దేశం చుట్టూ ఉన్న చిన్న దీవుల్లో చైనా జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమా? అన్న ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఈవిధంగా స్పందించారు.

పొరుగుదేశాలను అడగండి

‘‘బంగ్లాదేశ్‌కు వెళ్లి వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో అడగండి. శ్రీలంకనూ ఆరా తీయండి. వాళ్లు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటునప్పుడు వారికి ఎవరు అండగా నిలిచారు? కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నేపాల్‌ను అడగండి. ఉక్రెయిన్‌ సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ఎరువులు, ఇంధనం ఎవరు ఇచ్చారని ప్రశ్నించండి’’ అని జైశంకర్‌ మాట్లాడారు. సమస్యలు సృష్టించే శక్తులు పొరుగునే ఉండొచ్చని, వాటిని ఇష్టపడే వ్యక్తులు భారత్‌లోనూ ఉండే అవకాశం ఉందన్నారు.

పీవోకేపై స్పష్టమైన వైఖరి

భాజపా పాలనలో చైనాకు భారత్‌ తన భూభాగం కోల్పోయిందని వస్తోన్న ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ‘‘1962లో 38 వేల చ.కి.మీ. భూభాగాన్ని కోల్పోయాం. కానీ, 2000 తర్వాత మనం భూమి కోల్పోయామని ఆరోపించడం సరైంది కాదు’’ అని చెప్పారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)పై భాజపా ఇస్తోన్న ఎన్నికల హామీపై స్పందించిన ఆయన.. ‘‘భారత్‌లో పీవోకే భాగం కాదనే విషయాన్ని ఎప్పటికీ అంగీకరించమంటూ భారత పార్లమెంటు (Parliament) ఓ తీర్మానం చేసింది. దానిని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. ఇదే జాతీయస్థాయి వైఖరి’’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని