Indira Gandhi Assassination: లోక్‌సభ బరిలో.. ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నుంచి సరబ్‌జీత్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు కావడం గమనార్హం.

Updated : 11 Apr 2024 19:31 IST

అమృత్‌సర్‌: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) హంతకుడి కుమారుడొకరు లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌ (Punjab)లోని ఫరీద్‌కోట్‌ స్థానం నుంచి 45 ఏళ్ల సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్‌ సింగ్‌ కుమారుడే సరబ్‌జీత్‌. గతంలో ఈయన పలు ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 1,13,490 ఓట్లు దక్కాయి. ఆ తర్వాత 2007లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.

నటుల రాజకీయ రణస్థలం.. లోక్‌సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ

2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ బఠిండా, ఫతేగఢ్‌ సాహిబ్‌ స్థానాల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు 3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. కాగా.. సరబ్‌జీత్‌ తల్లి బిమల్‌ కౌర్‌ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్‌ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్‌ కూడా బఠిండా నుంచి విజయం సాధించారు.

ప్రస్తుతం సరబ్‌జీత్‌ పోటీ చేస్తున్న ఫరీద్‌కోట్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఎంపీ మహమ్మద్‌ సాదిఖ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ భాజపా తరఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్‌ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ పోటీ చేస్తున్నారు. ఇక, ఆమ్‌ఆద్మీ పార్టీ.. ప్రముఖ కమెడియన్‌ కరంజీత్‌ అనుమోల్‌ను బరిలోకి దించింది. శిరోమణి అకాలీదళ్‌, కాంగ్రెస్‌ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌ తుపాకులతో కాల్చడంతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని