Jammu and Kashmir: చొరబాటుకు సిద్ధంగా.. సరిహద్దుల్లో 250-300 మంది ఉగ్రవాదులు..

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌ సరిహద్దులో వందల మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, వారంతా భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నారని బీఎస్ఎఫ్‌ ఐజీ వెల్లడించారు. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు.

Updated : 16 Dec 2023 20:16 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో అంతర్జాతీయ సరిహద్దు (Border)ను దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు (Terrorists) చేసే ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. అయినప్పటికీ దాదాపు 300 మంది ఉగ్రవాదులు భారత్‌ (India)లోకి చొరబడేందుకు సరిహద్దు వెంబడి వేచి చూస్తున్నారని సరిహద్దు భద్రతా దళం (BSF) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముష్కరులను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బీఎస్‌ఎఫ్‌ ఐజీ అశోక్‌ యాదవ్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు సరిహద్దు వెంబడి 250-300 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అయితే, జమ్మూకశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్‌, సైన్యం (Army) అలర్ట్‌గా ఉంది. ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని మేం సమర్థవంతంగా భగ్నం చేస్తాం’’ అని ఆయన వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కశ్మీరీ ప్రజలు, భద్రతా దళాల మధ్య అనుబంధం పెరిగిందని ఐజీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు తమ సహకారం ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తిచేయగలుగుతామన్నారు.

నడి సముద్రంలో విదేశీ నౌక హైజాక్‌.. రంగంలోకి భారత నేవీ

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల కొన్నేళ్లలో ఉగ్రవాదుల చొరబాటు ఘటనలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. అడపాదడపా పర్వత ప్రాంతాలు, అడవుల గుండా ముష్కరులు సరిహద్దును దాటేందుకు యత్నిస్తూనే ఉన్నారు. వారిని బీఎస్‌ఎఫ్‌ దళాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నాయి. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు కూడా తగ్గినట్లు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌కు వెల్లడించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే కశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు 70శాతం, పౌర మరణాలు 72శాతం, భద్రతా దళాల మరణాలు 59శాతం తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు