Israel: లక్షద్వీప్‌ వెళ్లండి: మాల్దీవుల నిషేధం వేళ ఇజ్రాయెల్ ఎంబసీ పోస్టు

భారత్‌లోని లక్షద్వీప్ (Lakshadweep) సహా పలు బీచ్‌లకు వెళ్లండంటూ ఇజ్రాయెల్ (Israel) తన ప్రజలకు సూచించింది. కారణం ఏంటంటే..?

Published : 03 Jun 2024 18:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్‌ (Israel) పౌరులు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించేందుకు మాల్దీవులు (Maldives) సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ గురించి ప్రస్తావిస్తూ మన దేశంలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించింది. భారత్‌లోని బీచుల్లో పర్యటించండని తన ప్రజలకు సూచించింది. అలాగే ఆయా బీచ్‌ల ఫొటోలు షేర్ చేసింది.

‘‘ఇజ్రాయెల్‌ పర్యటకులపై మాల్దీవులు (Maldives) నిషేధం విధించాలని యోచిస్తోన్న తరుణంలో.. భారత్‌లోని కొన్ని బీచ్‌ల వివరాలు మీకోసం. వాటి వద్దకు మీకు ఆత్మీయ స్వాగతం లభిస్తుంది. అద్భుతమైన ఆతిథ్యం ఉంటుంది. మన దౌత్యవేత్తలు చేసిన పర్యటనల ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నాం’’ అంటూ ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం స్పందించింది. లక్షద్వీప్‌, గోవా, అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు, కేరళలోని బీచ్‌ల ఫొటోలను షేర్ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్‌ కొబ్బి షొషాని మరో పోస్టు పెట్టారు. దానికి జనవరిలో మోదీ లక్షద్వీప్‌ పర్యటన ఫొటోలను రీపోస్టు చేశారు. ‘‘మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ధన్యవాదాలు. ఇప్పుడు మా ప్రజలు భారత్‌లోని అందమైన బీచ్‌ల్లో పర్యటిస్తారు’’ అని మాల్దీవుల నిర్ణయంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంలోకి ఇజ్రాయెల్ పౌరులు రాకుండా నిషేధం విధించేందుకు సిద్ధమైన మాల్దీవులు (Maldives).. ఆ దిశగా ఆ దేశ మంత్రిమండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్‌ పాస్‌పోర్టు ఉన్న పౌరులను దేశంలోకి రాకుండా చేసేందుకు చట్టప్రకారం సవరణ చేస్తామని మంత్రి మండలి సమావేశం అనంతరం ఆ దేశ హోం మంత్రి అలీ తెలిపారు. ఏటా 10 లక్షల మంది పర్యటకులు మాల్దీవులను సందర్శిస్తారు. ఇందులో 15 వేల మంది ఇజ్రాయెల్‌ పర్యటకులు ఉంటారు. ఇదిలాఉంటే..  ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ (Lakshadweep)ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఈ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఒడుదొడుకులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మనకు అనుకూలంగా ఇజ్రాయెల్ స్పందన వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని