S Somanath: దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్‌

ఆలయాల్లో లైబ్రరీలు ఏర్పాటుచేయడం ద్వారా యువతను దేవాలయాల వైపు ఆకర్షించవచ్చని ఇస్రో ఛైర్మన్‌ ఎస్. సోమనాథ్‌ అన్నారు.  

Published : 18 May 2024 17:46 IST

తిరువనంతపురం: యువత ప్రార్థనా స్థలాలకు రావడానికి ఆసక్తి చూపించాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO ) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ (Somanath) అన్నారు.  ఈ విధంగా గ్రంథాలయాల ఏర్పాటుతో యువతను ఆకర్షించవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం సభ్యులు సోమనాథ్‌ను సన్మానించారు. ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. అనంతరం సోమనాథ్‌ మాట్లాడుతూ ‘ఈ అవార్డు ప్రదానోత్సవానికి యువకులు పెద్దసంఖ్యలో వస్తారని నేను ఊహించాను. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆలయ నిర్వాహకులు వారిని దేవాలయాల వైపు ఆకర్షించడానికి కృషి చేయాలి. ఇందుకోసం దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటుచేయకూడదు?’’అని ఆయన ప్రశ్నించారు. ఆలయాలు కేవలం వృద్ధులు వచ్చి దేవుడిని తలుచుకునేవిగానే కాకుండా సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలని ఆయన పేర్కొన్నారు. 

ఈవిధంగా చొరవ తీసుకోవడం వల్ల ధార్మిక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనుకునేవారు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారని ఆయన తెలిపారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చలు ఏర్పాటుచేస్తే యువకులు తమ అభివృద్ధికి బాటలు వేసుకునేందుకు దోహదపడుతుందని సోమనాథ్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. ఆలయ నిర్వాహకులు ఆ దిశగా కృషి చేస్తే సమసమాజంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని