Delhi Police: అది పులి కాదు.. పిల్లి!

దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం కేంద్ర మంత్రిమండలి ప్రమాణస్వీకారం సమయంలో కనిపించిన పులిలాంటి ఆకారంపై దిల్లీ పోలీసులు సోమవారం స్పష్టత ఇచ్చారు.

Updated : 11 Jun 2024 08:18 IST

రాష్ట్రపతి భవన్‌లో జంతువు తిరుగాడడంపై దిల్లీ పోలీసుల వివరణ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం కేంద్ర మంత్రిమండలి ప్రమాణస్వీకారం సమయంలో కనిపించిన పులిలాంటి ఆకారంపై దిల్లీ పోలీసులు సోమవారం స్పష్టత ఇచ్చారు. ఆ జంతువు పులి కాదని పిల్లి అని తెలిపారు. భాజపా ఎంపీ దుర్గాదాస్‌ ఉయికె ప్రమాణస్వీకారం చేశాక రిజిస్టర్‌లో సంతకం చేసి, రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్రపతి భవన్‌లోని కారిడార్‌లో నాలుగు కాళ్ల జంతువు ఆకారం వెళుతుండడం వీడియోలో కనిపించింది. దీనిపై సోషల్‌ మీడియాలో రకరకాల అభిప్రాయాలు మొదలయ్యాయి. కొందరు ఈ జంతువు చిరుతపులి అని పేర్కొన్నారు. దీనిపై దిల్లీ పోలీసులు స్పందించారు. ‘‘వీడియో సంగతి తెలియగానే మేం రాష్ట్రపతి భవన్‌ భద్రతా సిబ్బందితో మాట్లాడాం. రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఎలాంటి చిరుతపులి లేదని వారు తెలిపారు. కేవలం శునకాలు, పిల్లులు మాత్రమే ఉన్నట్లు స్పష్టంచేశారు’’ అని వెల్లడించారు. ‘‘వీడియోలో కనిపించిన నాలుగు కాళ్ల జంతువు ఇళ్లలో తిరుగాడే పిల్లి మాత్రమే. దయచేసి వదంతులను పట్టించుకోవద్దు’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని