Himachal rains: వర్ష బీభత్సాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నాం.. కేంద్రం ఆదుకోవాలి: హిమాచల్‌ సీఎం

భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలను ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించింది.

Updated : 18 Aug 2023 16:42 IST

శిమ్లా: భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా (state calamity) ప్రకటిస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్‌ సుఖు (sukhvinder Singh Sukhu) తెలిపారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం స్పందించి దీనిని ‘జాతీయ విపత్తు’గా (national calamity) ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఆదివారం నుంచి కురుస్తున్న జోరువానల కారణంగా శిమ్లా సహా పలు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.

దేశంలోనే తొలి ‘3డీ పోస్టాఫీస్‌’ ప్రారంభం.. ఎలా కట్టారో చూశారా..!

ఈ నేపథ్యంంలో శుక్రవారం సీఎం సుఖ్వీందర్‌ సుఖు మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలను వేగవంతం చేశామని చెప్పారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కావాల్సిన సాయం అందజేస్తున్నామన్నారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశాయని పేర్కొన్నారు. తక్షణమే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. ఈ వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని సుఖు తెలిపారు.

మరోవైపు సమ్మర్‌హిల్‌లో నేలకూలిన శివాలయం శిథిలాల కింద నుంచి ఇవాళ మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి. దాంతో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 75కు చేరింది. ఒక్క శిమ్లాలోనే మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సంజీవ్‌కుమార్‌ గాంధీ పేర్కొన్నారు. ఆలయ శిథిలాల మరో ఆరు మృతదేహాలుండొచ్చని భావిస్తున్నారు. 

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,301 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండటంతో 506 రహదారుల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాంగ్రా జిల్లాలో వరదలు సంభవించిన నేపథ్యంలో గత మూడు రోజుల్లోనే 2,074 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని