P Chidambaram: కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు.. ఇతర పార్టీలకు ఓ హెచ్చరిక : చిదంబరం

కాంగ్రెస్‌కు వస్తోన్న ఐటీ నోటీసులు మిగిలిన రాజకీయ పార్టీలకు ఓ హెచ్చరిక అని ఆ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం (P Chidambaram) అన్నారు. 

Published : 30 Mar 2024 19:34 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదాయపు పన్ను (Income Tax) అంశంలో కాంగ్రెస్‌ (Congress)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలు పేరిట రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసులు వచ్చినట్లు తెలిసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidambaram) రాజకీయ పార్టీలను హెచ్చరించారు.

‘‘ఎన్నికల బాండ్ల ద్వారా భాజపా రూ.8,250 కోట్లు సంపాదించింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపై ఆ ప్రభుత్వం రూ.135 కోట్ల ఫైన్ వేసింది. ఇది రాజకీయ పార్టీలు, ప్రజలకు ఓ హెచ్చరిక. భాజపా అన్ని పార్టీలను నిర్వీర్యం చేయాలని భావిస్తోంది. దాని అజెండా అయిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అసలు ఉద్దేశం ‘ఒకే దేశం- ఒకే పార్టీ’’ అని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగం నుంచి వరుసగా నోటీసులు వస్తున్నాయి. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను ఇటీవల దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయా మదింపు సంవత్సరాలకు పెనాల్టీ, వడ్డీ వసూలు నిమిత్తం హస్తం పార్టీకి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసులు అందాయి.

అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఆదాయపు పన్నుశాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు