Pune car crash: నోట్ల కట్టలు.. ట్విస్టులు: క్రైం థ్రిల్లర్ మరిపించేలా పుణె లగ్జరీ కారు ప్రమాదం కేసు

ఓ సంపన్న బాలుడిని రోడ్డు ప్రమాదం కేసు నుంచి కాపాడేందుకు అడుగడుగునా అధికారులు ఏ రకంగా యత్నించారో పుణెలో రోడ్డు ప్రమాదం కేసు చూస్తే తెలుస్తుంది. నిందితుడిని ఏకంగా ఏసీపీ కుర్చీలోనే కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Updated : 31 May 2024 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 17 ఏళ్ల సంపన్న బాలుడు పీకలదాకా తాగి చేసిన రోడ్డు ప్రమాదం కేసు ఇప్పుడు మన వ్యవస్థల్లో పాతుకు పోయిన అవినీతిని దేశానికి చూపిస్తోంది. చివరికి మృతి చెందిన టెకీల క్యారెక్టర్లపై అనుమానం వచ్చే ప్రశ్నలతో భాధితులను భయపెట్టేందుకు కూడా పోలీసులు వెనుకాడలేదనే ఆరోపణలున్నాయి. ఇద్దరి ప్రాణాలు తీసిన బాలుడిని 300 పదాల వ్యాసం రాయాలంటూ బెయిలిచ్చి పంపించబోయిన న్యాయమూర్తి ఇప్పుడు మీడియాను తప్పించుకు తిరుగుతున్నారు.

ఏకంగా ఏసీపీ కుర్చీలో కూర్చున్న నిందితుడు

నగరంలోని సంపన్న స్థిరాస్తి వ్యాపారి 17 ఏళ్ల కుమారుడు.. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి రెండు పబ్‌ల్లో మిత్రులతో కలిసి రూ.69 వేలు వెదజల్లి మద్యం తాగాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన ఖరీదైన అన్‌రిజిస్టర్డ్‌ పోర్షె టైకూన్‌ కారులో ఇంటికి బయల్దేరాడు. ఈ కారు రిజిస్ట్రేషన్‌ ఫీజును మార్చి నుంచి ప్రభుత్వానికి చెల్లించలేదని తెలిసింది.

అదే సమయంలో కల్యాణీ నగర్‌లోని ఓ క్లబ్‌లో మిత్రులతో కలిసి పార్టీ చేసుకొన్న అనీష్‌, అశ్విని అనే ఇద్దరు టెకీలు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వీరిద్దరిదీ జబల్పూర్‌. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ఆ తీవ్రతకు అనీష్‌, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు. ఆ మార్గంలో వెళ్తున్న పలువురు వ్యక్తులు కారులోని యువకులను పట్టుకున్నారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని యర్వాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పుణెలోని అనీష్‌ మావయ్య జ్ఞానేంద్ర సింగ్‌కు విషయం తెలిసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ అధికారుల తీరు చూసి ఆశ్చర్యపోయాడు. వారు బాధితుల బంధువులను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పైగా అనీష్‌-అశ్విని మధ్య సంబంధం ఏంటంటూ కేసుకు అవసరం లేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని జ్ఞానేంద్ర వాపోయాడు.

మరోవైపు ప్రమాదానికి కారణమైన ఆ కుర్రాడిని పోలీస్‌ స్టేషన్‌లో ఏసీపీ కుర్చీలో కూర్చొబెట్టి రాచమర్యాదలు చేయడం చూసి అక్కడే ఉన్న కొందరు క్రైం బీట్‌ రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. పిజ్జాలను తెప్పించి నిందితులకు ఇచ్చారు. కొద్ది సేపటికి ఏసీపీ ఆర్తి బాన్సుడే అక్కడికి చేరుకున్నారు. తన కుర్చీలో ఆ బాలుడు కూర్చోవడం చూసి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో బాలుడి బంధువు, లాయర్లు అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ ఎమ్మెల్యే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినా.. ప్రమాద తీవ్రత తెలిసి వెళ్లిపోయాడు. మర్నాడు అనీష్‌ మిత్రుడు అఖిబ్‌ ముల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్‌ 304ఏ (నిర్లక్ష్యంతో ప్రాణాలు తీయడం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

పోలీస్‌ స్టేషన్‌ నుంచి జేజేబీ వరకు..

ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్‌స్టేషన్‌ నుంచి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెట్టి నిందితుడి కుటుంబం అధికారులను కొనేసినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడికి ఆల్కహాల్‌ పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రవర్తన పరీక్షను చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు. 18వ తేదీ రాత్రి నిందితుడు మద్యం తాగితే.. 19వ తేదీ ఉదయం 9 గంటలకు సాసూన్‌ ఆస్పత్రికి తరలించారు. పర్సనల్‌ అపియరెన్స్‌ పరీక్షకూ దాదాపు 8 గంటలు ఆలస్యమైంది. ఇక అక్కడ ఉదయం 11 గంటలకు రక్త నమూనాలు సేకరించడం అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే మద్యం తాగిన అన్ని గంటల తర్వాత రక్తంలో ఆల్కహాల్‌ ఆనవాళ్లు తగ్గిపోతాయి. 

తప్పుడు నివేదికలకు రూ.లక్షల్లో డీల్‌..?

ఇక సాసూన్‌ ఆస్పత్రి డాక్టర్లను ‘మేనేజ్‌’ చేయడానికి బాలుడి తండ్రి రంగంలోకి దిగాడు. ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ అజేయ్‌ తావ్‌డేతో 14 సార్లు ఫోన్లో మాట్లాడాడు. డీల్‌ కుదిరింది. రూ.3 లక్షల నగదును ఆస్పత్రి ప్యూన్‌కు చేర్చాడు. అప్పటికే డాక్టర్‌ తావ్‌డే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీహరితో చెప్పడంతో.. రక్త నమూనాలను మార్చేశాడు. బాలుడి నమూనాలు పారేసి ఓ మహిళ నమూనాలను చేర్చారు. మొత్తం రూ.50 లక్షలకు డీల్‌ కుదిరినట్లు భావిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఏదో జరుగుతోందని అనుమానించిన ఉన్నతాధికారులు బాలుడి రక్తనమూనాలు మరోసారి సేకరించి జిల్లా ఆస్పత్రికి పంపారు. ఈ ఫలితాల ఆధారంగానే సాసూన్‌ ఆస్పత్రిలో జరిగిన మోసం బయటపడింది.

జువైనల్‌ జస్టిస్‌ బోర్డు తీరు వివాదాస్పదం..

ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట హాజరుపర్చారు. అక్కడ న్యాయమూర్తి ఎల్‌ఎన్‌ దన్వాడే నిందితుడి విషయంలో ఉదారంగా వ్యవహరించారు. తక్షణమే బెయిల్‌ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయడం, 15 రోజులు ట్రాఫిక్‌ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు దీనిలో ఉన్నాయి. ఈ బెయిల్‌ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. నిందితుడికి వ్యతిరేకంగా 20వ తేదీన ఆందోళనలు చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్‌ హోమ్‌కు తరలించారు. పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్‌ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడణవీస్‌ ప్రకటించాల్సి వచ్చింది.

సస్పెన్షన్లు..

* ఈ కేసు సంచలనంగా మారడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. 

* రక్త నమూనాలు మార్చిన డాక్టర్‌ శ్రీహరిని డిస్మిస్‌ చేశారు. డాక్టర్‌ అజయ్‌ తావ్‌డేను సస్పెండ్‌ చేశారు. ప్యూన్‌పై కూడా వేటు పడింది. ఈ ముగ్గురిని అరెస్టు చేశారు.

* బాలుడికి తక్షణమే బెయిల్‌ ఇచ్చిన న్యాయమూర్తి దన్వాడేపై విచారణ మొదలైంది. ఆయన మీడియా నుంచి తప్పించుకునేందుకు ఓ స్కూటీపై హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. విచారణ నివేదిక వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని