ఎంసీఏ విద్యార్థిని దారుణ హత్య.. కాంగ్రెస్ కార్పొరేటర్‌కు జేపీ నడ్డా పరామర్శ

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె నేహా(23)ను ఇటీవల హుబ్బళ్లిలో ఫయాజ్‌ అనే యువకుడు కిరాతకంగా హత్య చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరామర్శించారు.

Published : 21 Apr 2024 19:14 IST

హుబ్బళ్లి: తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్‌ (24) అనే యువకుడు ఇటీవల కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటనపై కర్ణాటకలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హుబ్బళ్లిలో బాధిత కుటుంబాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరామర్శించారు. విద్యార్థిని తండ్రి హుబ్బళ్లి-ధార్వాడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నిరంజన్‌ హీరేమఠ ఇంటికి వెళ్లిన నడ్డా.. ఆ దంపతులను కలిసి ధైర్యం చెప్పారు. నడ్డా వెంట కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ, పలువురు భాజపా నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది షాకింగ్‌ ఘటన.  దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర చేసిన స్టేట్‌మెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. వారి ప్రకటనలు దర్యాప్తును నీరుగార్చేలా ఉన్నాయి. బుజ్జగింపు రాజకీయాలను కర్ణాటక ప్రజలు ఉపేక్షించరు. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

బంద్‌కు పిలుపునిచ్చిన ముస్లిం సంస్థలు

మరోవైపు, నేహా (23)ను కిరాతకంగా హత్య చేసిన ఘటనను పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థిని హత్యకు నిరసనగా ఏప్రిల్‌ 22 (సోమవారం)న స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. బాధిత కుటుంబానికి సంఘీభావంగా తాము బంద్‌ను పాటిస్తున్నట్లు ధార్వాడ్‌కు చెందిన అంజుమన్‌-ఇ-ఇస్లామ్‌ అధ్యక్షుడు ఇస్మాయిల్‌ టమట్గర్‌ వెల్లడించారు. ముస్లిం వర్గానికి చెందిన వ్యాపారులంతా సోమవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బంద్‌లో పాల్గొంటారన్నారు. మాంసం దుకాణాలు, గ్యారేజ్‌ వర్క్‌షాప్‌లు, పండ్ల వ్యాపారులు, బ్యాంకులు, పలు సంస్థలు మూసివేస్తామని పేర్కొన్నారు. తమ దుకాణాల వద్ద ‘జస్టిస్‌ ఫర్‌ నేహా’ స్టిక్కర్లను అతికించడంతో పాటు ర్యాలీ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇలాంటి దారుణాలు మరే ఆడబిడ్డలపైనా జరగకూడదనే సందేశాన్ని ఇవ్వడమే తమ నిరసన ఉద్దేశమని పేర్కొన్నారు.  

కాలేజీ క్యాంపస్‌లో ఘోరం.. కార్పొరేటర్‌ కుమార్తె దారుణ హత్య

ఏప్రిల్‌ 18న హుబ్బళ్లిలోని బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో హుబ్బళ్లి పాలికె కార్పొరేటర్‌ నిరంజన్‌ హీరేమఠ కుమార్తె నేహా (23)ను ఫయాజ్‌ అనే యువకుడు కత్తితో కిరాతకంగా పొడిచి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కత్తితో తొమ్మిదిసార్లు దాడి చేసిన కిరాతక ఘటనపై హుబ్బళ్లి, ధార్వాడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని ఉరితీయాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు ఫయాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని