Rajkot: మొదటి అంతస్తు నుంచి దూకేశాం...

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రమాదం నుంచి బయట పడిన వారు మాట్లాడుతూ హఠాత్తుగా సంభవించిన ప్రమాదంలో గేమ్‌జోన్‌లో ఉన్న పిల్లలు, పెద్దలు చేసే హాహాకారాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిందని వెల్లడించారు.

Published : 26 May 2024 12:55 IST

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని, శిథిలాల్లో మరికొందరి మృతదేహాలు ఉండొచ్చని తెలిపారు. కాగా మంటలు చెలరేగుతున్న సమయంలో కొందరు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలతో బయట పడ్డారు. 

ప్రమాదం నుంచి బయట పడిన పృథ్వీరాజ్‌సింగ్ జడేజా అనే  వ్యక్తి మాట్లాడుతూ ‘‘మేము మొదటి అంతస్తులో గేమ్స్‌ ఆడుతుండగా ఇద్దరు సిబ్బంది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వ్యాపిస్తున్నాయని బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగానే అంతా పొగతో నిండిపోయింది. చుట్టూ ఏమవుతుందో అర్థం కాలేదు. వెనుక గేటు నుంచి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ కూడా మంటలు చెలరేగాయి. దాంతో వేరే దారి లేక మరో  ఐదుగురితో పాటు మొదటి అంతస్తు కిటికీ నుంచి దూకేశాను. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 70మంది వరకు పిల్లలు అక్కడ ఉన్నారు.’’అని తెలిపారు. 

ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 300మందికి పైగా ప్రజలు  గేమ్‌జోన్‌లో ఉన్నారని రాజ్‌కోట్ అగ్నిమాపక అధికారి ఇలేష్ ఖేర్ తెలిపారు.  గేమ్‌జోన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం, పైకప్పు కూలిపోవడంతో ప్రజలు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారన్నారు. కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయని వాటిని డీఎన్‌ఏ టెస్ట్‌కు పంపామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని