Calcutta HC: కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి?

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ రాజీనామా చేశారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు వస్తున్నాయి.

Published : 05 Mar 2024 13:36 IST

కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ (Justice Abhijit Gangopadhyay) రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించానని వెల్లడించారు. ఈ మధ్యాహ్నం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలుస్తానని చెప్పారు. జస్టిస్‌ గంగోపాధ్యాయ్‌ చివరి పనిరోజు సోమవారంతో ముగిసింది.

పశ్చిమ బెంగాల్‌లో విద్యారంగానికి సంబంధించి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ ఇటీవల ఇచ్చిన పలు తీర్పులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై విచారణ జరపాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశించారు. ఆయన తీర్పులపై అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు వార్తలు వినిపించాయి.

2018 మే నెలలో కలకత్తా హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌.. 2020 జులైలో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ ఉన్నప్పటికీ ముందస్తుగానే రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే కథనాలు వెలువడ్డాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని