Mukhtar Ansari: ముఖ్తార్‌ అన్సారీ చావుతో న్యాయం జరిగింది: అల్కా రాయ్‌

ముఖ్తార్‌ అన్సారీ చావుతో తన కుటుంబానికి న్యాయం జరిగిందని దివంగత భాజపా ఎమ్మెల్యే ఆనంద్‌రాయ్‌ సతీమణి అల్కారాయ్‌ అన్నారు.

Published : 30 Mar 2024 02:41 IST

వారణాసి: గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ వేత్త ముఖ్తార్‌ అన్సారీ (Mukhtar ansari) చావుతో తమకు న్యాయం జరిగిందని దివంగత భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్‌ (Krishnanand Rai) సతీమణి అల్కా రాయ్‌ (Alka Rai) అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ బందా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో ఏప్రిల్‌ 2023లో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక 1990లో ఆయుధ లైసెన్స్‌ పొందేందుకు నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారన్న కేసులో మార్చి 13, 2024న ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

అన్సారీ మృతిపై అల్కారాయ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇది దేవుడి ఆశీర్వాదం వల్లే జరిగింది. న్యాయం చేయాలని నేను ప్రార్థించాను.     అవి ఈనాటికి ఫలించాయి’’ అని ఆమె అన్నారు. తన భర్తను అన్సారీ హత్య చేసినప్పటి నుంచి తాము హోలీ పండగ చేసుకోలేదని, ఇవాళే మా కుటుంబానికి పండగ వచ్చిందన్నారు. ఎంతోమంది పిల్లల్ని అనాథల్ని చేసిన ఓ దుర్మార్గుడికి ఈ భూమిపై నూకలు చెల్లిపోయాయని, ఆ కుటుంబాలు అన్నింటికీ ఇవాళ పండగ రోజేనని ఆనందం వ్యక్తం చేశారు. అన్సారీ మృతిపై అనుమానాలు రేకెత్తించడం సరికాదని ప్రతిపక్షాలకు ఆమె హితవు పలికారు.

స్లో పాయిజన్‌ ఇచ్చి చంపేశారు: ఉమర్‌ అన్సారీ

ముఖ్తార్‌ అన్సారీ అనారోగ్యంతో చనిపోలేదని దీనివెనక కుట్ర కోణం దాగుందని ఆయన తనయుడు ఉమర్‌ అన్సారీ అనుమానం వ్యక్తంచేశారు. స్లో పాయిజన్‌ ఇచ్చి చంపేశారని విమర్శించారు. రెండు రోజుల క్రితం ఆయన్ని కలిసేందుకు వెళ్తే అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ నా తండ్రిపై హత్యాయత్నం జరుగుతోందని రెండు రోజుల క్రితమే చెప్పా.. ఇప్పుడూ అదే చెబుతున్నా. స్లో పాయిజన్‌ ఇచ్చి నా తండ్రిని చంపేశారు. మార్చి 19నే ఆహారంలో విషం కలిపారు. దీనిపై కోర్టుకు వెళ్తాం. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది’’ అని ఉమర్‌ అన్సారీ అన్నారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు చేయాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని