Pune Porsche Case: పుణె కారు ప్రమాదం కేసు: జువైనల్‌ బోర్డు సభ్యులపై విచారణ

పుణెలో పోర్ష్‌ కారు ప్రమాదం కేసులో జువైనల్‌ జస్టిస్‌ బోర్డు కూడా దర్యాప్తును ఎదుర్కొంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. 

Published : 29 May 2024 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పుణె రోడ్డు ప్రమాదం కేసులో జువైనల్‌ జస్టిస్‌ బోర్డు వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి కారణమైన బాలుడికి అతి తేలిగ్గా బెయిల్‌ ఇవ్వడంపై విచారణ జరపనున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకొన్న జువైనల్‌ బోర్డు అధిపతి డాక్టర్‌ ఎల్‌ఎన్‌ దన్వాడే పాత్రపై దర్యాప్తు చేయనున్నారు.

ఈ ప్రమాదం కేసు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుటకు రాగానే 300 పదాలతో వ్యాసరచన చేయమనడం, 15 గంటలు ట్రాఫిక్‌ పోలీసులకు సాయం..తదితర  నిబంధనలతో తక్షణమే బెయిల్‌ ఇచ్చేసింది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో తిరిగి నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు, డాక్టర్లు నిందితుడికి సాయం చేసినట్లు తేలడంతో.. ఇప్పుడు జువైనల్‌ బోర్డుపై ప్రభుత్వం దృష్టిపడింది. దీంతో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇది విచారణ జరిపి వచ్చే వారం మహిళా శిశు అభివృద్ధి శాఖకు నివేదికను సమర్పించనుంది.

పోర్ష్‌ కారు ప్రమాదం జరిగిన సమయంలో బాలుడు మద్యం తాగి ఉన్నట్లు తాజాగా అతడి మిత్రులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. వారిని దర్యాప్తు అధికారులు ఆరు గంటలపాటు విచారించారు. ప్రమాద సమయంలో నిందితుడు కారు డ్రైవ్‌ చేయనట్లు చూపించాలని అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు వైద్యులు డబ్బుకు కక్కుర్తిపడి నిందితుడి రక్త నమూనాలను మార్చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీంతో వారిని అరెస్టు చేశారు. ఇద్దరు పోలీసు అధికారులు ఇప్పటికే  సస్పెండ్‌ అయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు