Kangana Ranaut: కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ

బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది.

Updated : 07 Jun 2024 06:57 IST

చండీగఢ్‌ విమానాశ్రయంలో చేయిచేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ 

చండీగఢ్‌: బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. దిల్లీలో జరుగుతున్న ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు కంగన విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా తనిఖీ చేసుకొని ముందుకు వెళుతున్న కంగనాను అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ చెంపపై కొట్టారు. దీంతో భద్రతా అధికారులు కంగన చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో గతంలో ఆందోళన నిర్వహించిన రైతుల విషయంలో కంగన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కానిస్టేబుల్‌ దాడిచేసినట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్‌ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి 74 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కుల్విందర్‌ కౌర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, నిర్బంధంలో తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు సీఐఎస్‌ఎఫ్‌ తెలిపింది.

నేను క్షేమమే కానీ..

దిల్లీ వెళ్లిన అనంతరం చండీగఢ్‌ సంఘటనపై ‘ఎక్స్‌’ వేదికగా కంగనా రనౌత్‌ స్పందించారు. పంజాబ్‌లో ఉగ్రవాదం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘విమానాశ్రయంలో భద్రతా తనిఖీ పూర్తిచేసుకొని వెళుతున్నాను. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ నా పక్కనుంచి వచ్చి ముఖం మీద కొట్టి తిట్టడం ప్రారంభించింది. ఎందుకలా చేశావ్‌ అని ఆమెను అడిగాను. రైతుల ఆందోళనలకు మద్దతిస్తున్నానని ఆమె తెలిపింది. నేను క్షేమమే కానీ.. పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే నా ఆందోళన’’ అని ఆమె పేర్కొన్నారు. కంగనాపై దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని తాము సీఐఎస్‌ఎఫ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ తెలిపారు.


ఎందుకు కొట్టానంటే..

కంగనాను కొట్టిన కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌- ఆమెను తాను ఎందుకు అలా కొట్టవలసి వచ్చిందో ఎయిర్‌పోర్టులోనే గట్టిగా చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన చేస్తున్న సమయంలో కంగన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే తాను ఈ చర్యకు దిగినట్లు పేర్కొన్నారు. ‘‘రూ.100, రూ.200 కోసం కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారని కంగన ప్రకటనలు చేశారు. ఆ సమయంలో మా అమ్మ అక్కడ ఆందోళన చేస్తోంది’’ అని కుల్విందర్‌ తెలిపింది. 35 ఏళ్ల కుల్విందర్‌ 2009లో సీఐఎస్‌ఎఫ్‌లో చేరారు. 2021 నుంచి చండీగఢ్‌ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నారు. కుల్విందర్‌ సోదరుడు రైతు నాయకుడు. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ కార్యదర్శి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు