Kangana Ranaut: షాకింగ్‌.. కంగనను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్‌!

బాలీవుడ్‌ నటి, మండి ఎంపీగా విజయం సాధించిన కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Updated : 06 Jun 2024 21:41 IST

చండీగఢ్‌: బాలీవుడ్‌ నటి, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్‌ (kangana ranaut)కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గురువారం మధ్యాహ్నం దిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్‌ విమానాశ్రయంలో బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా నటి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. కంగన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి సీటు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

నేను క్షేమంగానే ఉన్నా.. కానీ..!

తనపై జరిగిన దాడి ఘటనపై కంగన స్పందించారు. తాను బాగానే ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయి పాస్‌ కోసం వేచి చూస్తుండగా.. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్‌ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు తనను దూషించారన్నారు. ఎందుకిలా చేశావని అడిగితే.. తాను రైతు నిరసనలకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్లు కంగన తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని.. కాకపోతే పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందన్నారు. 

ఆ కానిస్టేబుల్‌ సస్పెండ్.. కేసు నమోదు

దిల్లీ చేరుకున్న అనంతరం కంగన సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఇతర సీనియర్‌ అధికారుల్ని కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ కార్యాలయానికి తరలించారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసిన అనంతరం ఆమెపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో CISF అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే,  ‘గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో రూ.100ల కోసమే రైతులు కూర్చొన్నారంటూ కంగన మాట్లాడారు. ఆమె వెళ్లి అక్కడ కూర్చోగలరా? కంగన అలా మాట్లాడినప్పుడు మా అమ్మ కూడా నిరసనల్లో కూర్చొన్నారు’ అని సదరు కానిస్టేబుల్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని