Karnataka: క్యాబినెట్ మంత్రులకు సీఎం సిద్ధూ డిన్నర్‌.. ‘బిగ్ ఛేంజ్’ రానుందా..?

Eenadu icon
By National News Team Published : 09 Oct 2025 13:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక క్యాబినెట్‌లో బిగ్ ఛేంజ్ రానుందా..? మంత్రులకు డిన్నర్ ఇచ్చి తర్వాత వేటేయనున్నారా..? రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో 50 శాతం మంత్రులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి (Karnataka Congress).

అక్టోబర్ 13న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) క్యాబినెట్ మంత్రులకు డిన్నర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ (Congress) హైకమాండ్‌తో చర్చించిన సమయంలో సీఎం తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించినట్లు సమాచారం. నవంబర్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దానిలోభాగంగా ప్రస్తుతం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న 50 శాతం మంది మంత్రులను తొలగించి, కొత్తవారికి అవకాశం ఇస్తారని సమాచారం. 

కొత్తవారిని క్యాబినెట్‌లోకి తీసుకుంటే.. ఆ వెంటనే సీఎం మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం కష్టతరమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. పార్టీలో ముఖ్యమంత్రి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వీలు కలగనుందని చెప్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పుపై రోజుకో చర్చ నడుస్తోంది. తనకు సీఎం పదవి చేపట్టాలని ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Dk Shivakumar) పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

బిగ్‌బాస్‌ హౌస్‌కు తాళాలు.. సీఎం వద్దకు నేతల ఫైటింగ్‌..!

కన్నడ బిగ్‌బాస్ హౌస్‌కు తాళాలు వేసిన వ్యవహారంపై కర్ణాటకలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తాయి. వారి పంచాయతీ ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య వద్దకు చేరింది. బిగ్‌బాస్‌ (Bigg Boss) హౌస్‌ను మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం జరుగుతున్న బిడదిలోని అమ్యూజ్‌మెంట్ పార్కు ‘జాలీవుడ్‌’ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తోందని ఆరోపణలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. వీటిని షో (Bigg Boss Kannada) నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో హౌస్‌కు తహసీల్దారు తేజస్విని అధికారులతో కలిసి బయట నుంచి తాళాలు వేశారు. 

ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్, ఎమ్మెల్యే నరేంద్రస్వామి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఆ బోర్డ్ పని చేస్తోంది. అయితే ఆ శాఖ బాధ్యతలు చూస్తోన్న మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు ఎమ్మెల్యే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నరేంద్ర స్వతంత్రంగా వ్యవహరించడం మంత్రిని షాక్‌కు గురిచేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసిందని వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం సీఎం సిద్ధరామయ్య చెంతకు చేరింది. ఆయన ఆ ఇద్దరు నేతలతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఇదిలాఉంటే..  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (Dk Shivakumar) జోక్యంతో బిగ్‌బాస్ హౌస్‌ తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు