Politics: టూరింగ్‌ టాకీసులలో ‘అశ్లీల చిత్రాలు’.. హెచ్‌డీకే - డీకేఎస్‌ మాటల యుద్ధం

డీకే శివకుమార్‌కు చెందిన టూరింగ్‌ టాకీసులలో (Cinema Halls) గతంలో ‘అశ్లీల సినిమాలు’ ప్రదర్శించేవారంటూ హెచ్‌డీ కుమారస్వామి చేసిన ఆరోపణలను డిప్యూటీ సీఎం తిప్పికొట్టారు.

Updated : 21 Nov 2023 17:18 IST

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DKS), మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HDK)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డీకే శివకుమార్‌కు చెందిన టూరింగ్‌ టాకీసులలో (Cinema Halls) గతంలో ‘అశ్లీల సినిమాలు’ ప్రదర్శించేవారంటూ హెచ్‌డీ కుమారస్వామి ఆరోపణలు చేయడం తాజా వివాదానికి కారణమయ్యింది. దీన్ని తిప్పికొట్టిన డిప్యూటీ సీఎం డీకేఎస్‌.. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ సవాల్‌ విసిరారు.

‘దొడ్డనహళ్లిలోని ఓ థియేటర్‌లో ప్రదర్శించే సినిమాల మధ్యలో అశ్లీల క్లిప్పులను వేసే ఒక నేత ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు’ అంటూ జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. తాజాగా మారోసారి ఇదే విషయంపై స్పందించిన కుమారస్వామి.. తన పేరుతో ఇటీవల పోస్టర్లు అంటించడంపై మండిపడ్డారు. దొడ్డనహళ్లి, శతానుర్‌లలో అశ్లీల సినిమాలు ప్రదర్శించే వ్యక్తి (డీకే శివకుమార్‌) తీరు ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. దీంతో ఇద్దరు అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఎప్పటికైనా.. నేనే ముఖ్యమంత్రి

దీనిపై డీకే శివకుమార్‌ స్పందించారు. ఇదే వ్యవహారంపై బెంగళూరులో విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కుమారస్వామిని చూస్తుంటే బాధగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో నాలాంటి వ్యక్తిని కేబినెట్‌లోకి ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. ‘నా సొంత నియోజకవర్గం కనకపురకు స్వయంగా వెళ్లి.. ఆ థియేటర్‌లో ఏ సినిమాలు ఆడుతున్నాయి? అటువంటి సినిమాలు ప్రదర్శించానా? లేదా? అనే విషయాన్ని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలి’ అని బదులిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1.23 లక్షలకు పైగా ఓట్లతో కనకపుర ప్రజలు తనను ఎన్నుకున్నారని.. కర్ణాటకలోనే ఇదో రికార్డు అని పేర్కొన్నారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ గతంలో సినిమా హాళ్లను నిర్వహించేవారు. దొడ్డనహళ్లి, హరుబిలి, కొదిహళ్లితోపాటు హునేసహళ్లి ప్రాంతాల్లో టూరింగ్‌ టాకీస్‌లు ఉండేవి. హునేసహళ్లిలో ప్రస్తుతం ఒక టాకీస్‌ ఇంకా నడుస్తోందని డీకే శివకుమార్‌ స్వయంగా వెల్లడించారు. అవి తనపేరు మీదే ఉన్నాయని.. అందులో ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు.

ఇదిలాఉంటే, దీపావళి రోజున దీపాల అలంకరణ కోసం స్తంభం నుంచి నేరుగా విద్యుత్తు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రూ.68వేలు జరిమానా చెల్లించారు. డెకరేటర్‌ చేసిన తప్పిదాన్ని తనపై వేసుకుని బాధ్యతగా జరిమానా చెల్లించానని కుమారస్వామి స్పష్టం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ తనను లక్ష్యంగా చేసుకుని విద్యుత్తు చోరుడు అంటూ పోస్టర్లు వేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని