మోదీ బస.. ఆ రూ.80లక్షల బిల్లు మేమే చెల్లిస్తాం - కర్ణాటక ప్రభుత్వం

మైసూరులో గతేడాది ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ బస చేసిన ఓ హోటల్‌ బిల్లు ఇంకా చెల్లించకపోవడం తాజాగా చర్చనీయాంశమయ్యింది.

Published : 28 May 2024 00:06 IST

బెంగళూరు: మైసూరులో గతేడాది ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ బస చేసిన ఓ హోటల్‌ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది. ఆ రోజు హోటల్‌ బిల్లు రూ.80లక్షలు ఇంకా చెల్లించక పోవడమే ఇందుకు కారణం. దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పెండింగులో ఉన్న ఆ బిల్లును కర్ణాటక ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది.

‘రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయం. కానీ, రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ కార్యక్రమాన్ని ఎన్‌టీసీఏ ఏర్పాటు చేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదు. అయినప్పటికీ ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది’ అని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే వెల్లడించారు.

‘ప్రాజెక్టు టైగర్‌’ మొదలై 50ఏళ్లు పురస్కరించుకొని గతేడాది ఏప్రిల్‌లో మైసూరులో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు రూ.3కోట్లు ఖర్చు అంచనా వేసినప్పటికీ.. అది రూ.6.33కోట్లకు చేరుకుంది. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (NTCA) రూ.3కోట్లు చెల్లించగా.. మిగతావి పెండింగులోనే ఉన్నాయి. అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. మైసూరులోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో బస చేశారు. ఇప్పటికీ ఆ హోటల్‌ బిల్లు రూ.80 లక్షలు చెల్లించలేదు. దీంతో వాటిని రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు హోటల్‌ యాజమాన్యం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు