Farooq Abdullah: కశ్మీర్‌.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే: ఫరూక్‌

కశ్మీర్‌.. గతంలో, ఇప్పుడు.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah) పేర్కొన్నారు.

Published : 25 Feb 2024 23:06 IST

బెంగళూరు: కశ్మీర్‌.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah) ఉద్ఘాటించారు. ‘కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ నేషనల్‌ యూనిటీ 2024’ పేరుతో బెంగళూరులో నిర్వహించిన సదస్సు ప్రారంభోపన్యాసం చేసిన ఆయన.. ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

‘‘కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. గతంలో.. ఇప్పుడు.. భవిష్యత్తులోనూ భాగంగానే ఉంటుంది. అయినప్పటికీ దేశ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అప్పుడే అది మరింత పటిష్ఠంగా ఉంటుంది. మతం మనల్ని విభజించదు. అది ఏకం చేస్తుంది. మనం ముందుకు వెళ్లాలంటే.. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవడంతోపాటు ఒకరికొకరు అండగా నిలబడటం ఒక్కటే మార్గం. మనల్ని విభజించాలనుకునే శక్తులతో పోరాటం చేయాలి’’ అని ఫరూక్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

నేడు ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోందన్న ఫరూక్‌.. దాన్ని పటిష్ఠంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అలా చేయకుంటే రానున్న రోజుల్లో పశ్చాత్తాప పడతామన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. మనం భారత్‌ మరింత ప్రకాశించాలని కోరుకుంటుంటే.. వాళ్లు (భాజపా) మాత్రం చరిత్రను చీకటిలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని