Kashmiri activist: ‘నేను మలాలాను కాదు’: కశ్మీరీ యువతి ప్రసంగం వైరల్‌

బ్రిటన్ పార్లమెంట్ భవనం వేదికగా కశ్మీరీ యువతి యానా మిర్(Yana Mir) చేసిన ప్రసంగం ఆకట్టుకుంటోంది. 

Published : 23 Feb 2024 17:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నేను మలాలాను కాదు’ అంటూ బ్రిటిష్ పార్లమెంట్ భవనంలో కశ్మీరీ హక్కుల కార్యకర్త యానా మిర్‌(Yana Mir) చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్‌గా మారింది.  మొత్తం జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) అధ్యయనం కోసం ఏర్పడిన జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్(JKSC) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

సంకల్ప్‌ దివస్ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో యానా మిర్ మాట్లాడుతూ.. ‘నేను మలాలా యూసఫ్‌జాయ్‌ను కాదు. ఎందుకంటే నేను భారత్‌లో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. భారత్‌లో భాగమైన జమ్మూకశ్మీర్‌లోని నా ఇంట్లో నివసిస్తున్నాను. నాకు స్వదేశం నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు’ అంటూ ఆమె చేసిన ప్రసంగం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆమె మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈసందర్భంగా ఆమె భారత ఆర్మీ చేస్తోన్న కృషిని ప్రస్తావించారు. యువత హింసకు దూరంగా.. విద్య, క్రీడల వైపు వెళ్లేలా అవకాశాలు కల్పించడంలో చేస్తోన్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌ పార్లమెంట్ సభ్యులు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ వేదికపై ఆమె డైవర్సిటీ అంబాసిడర్ అవార్డును అందుకున్నారు.

యానామిర్‌ ప్రస్తావించిన మలాలా యూసఫ్‌జాయ్‌ పాకిస్థాన్‌లోని స్వాత్‌ లోయలో జన్మించారు.  బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులకు దిగారు. మలాలా ఎడమ కణితిపై, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అనంతరం బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారు. ఆమె 2014లో 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకొని చరిత్ర సృష్టించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని