Indian Railways: 160 కి.మీ. వేగంలోనూ ‘కవచ్‌’ పనితీరు భేష్‌!

స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

Updated : 25 Jan 2024 15:40 IST

దిల్లీ: రైలు ప్రమాదాల నివారణకు అభివృద్ధి చేసిన కవచ్‌ వ్యవస్థ (Kavach System) వేగంగా ప్రయాణించే సమయంలోనూ మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు ఉత్తర మధ్య రైల్వే (North Central Railway) తెలిపింది. గత వారం హరియాణాలోని పల్వాల్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర స్టేషన్ల మధ్య నడిచే సెమీ-హైస్పీడ్‌ రైలులో ఈ వ్యవస్థను ఏర్పాటుచేసి పరీక్షించినట్లు ఆగ్రా రైల్వే డివిజన్‌ ప్రతినిధి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. గంటకు 160 కి.మీ. వేగం వద్ద ఇది సమర్థంగా పనిచేసిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. 

‘‘కవచ్‌ వ్యవస్థను పరీక్షించేందుకు రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు బ్రేకులు వేయొద్దని లోకో పైలట్‌కు సూచించాం. 160 కి.మీ. వేగంతో వస్తున్నా.. సిగ్నల్‌ పడగానే 30 మీటర్ల ముందే కవచ్‌ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసి రైలును ఆపింది. ఇందులో ఉపయోగించిన ప్యాసింజర్‌ కోచ్‌లు శతాబ్ది, గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వాడతారు. త్వరలో ప్రయాణికులతో కూడిన రైలులో ఈ వ్యవస్థను పరీక్షిస్తాం’’ అని ప్రశస్తి తెలిపారు.

దిల్లీ-ఆగ్రాల మధ్య ఉన్న 125 కి.మీ. నెట్‌వర్క్‌ను అధికారులు మూడు భాగాలుగా విభజించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లో గరిష్ఠ వేగం 130 కి.మీ.లు కాగా.. దిల్లీ-ఆగ్రాల మధ్య మాత్రం 160 కి.మీ. గతేడాది డిసెంబరులో కవచ్‌ను ఈ మార్గంలో 140 కి.మీ. వేగం వద్ద పరీక్షించారు. వందే భారత్‌ వంటి సెమీ-హైస్పీడ్‌ రైళ్ల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో ఇలాంటి వ్యవస్థలు ప్రమాదాల నియంత్రణలో కీలకమవుతాయని అధికారులు తెలిపారు. 

కవచ్‌ ఎలా పనిచేస్తుందంటే?

కవచ్‌ వ్యవస్థను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రీసెర్చ్‌ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌ (RDSO) రూపొందించింది. రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ రైలును ముందుకుతీసుకెళ్లడం, పట్టాలు సరిగా లేనప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా గుర్తించి ఇది ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే స్పందించి నిర్దేశిత వేగానికి తగ్గిస్తుందని ఆర్‌డీఎస్‌వో అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని