Arvind Kejriwal: బెయిల్‌ కోసం.. కేజ్రీవాల్‌ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

Arvind Kejriwal: బెయిల్‌ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్‌ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది.

Published : 18 Apr 2024 15:42 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi excise scam case)లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. అయితే, ఆరోగ్య కారణాలు చూపించి ఈ కేసులో బెయిల్‌ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తాజాగా ఆరోపించింది. డయాబెటీస్‌ ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఆయన రోజూ తీసుకుంటున్నారని పేర్కొంది.

చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. దిల్లీ సీఎం అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ.. ఆయనపై కీలక ఆరోపణలు చేసింది. ‘‘ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఉంది. దీంతో ఆయన తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారు. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారు. ఇలాంటివి తింటే షుగర్‌లెవల్స్‌ పెరుగుతాయని ఆయనకు తెలుసు. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు’’ అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్‌

జైల్లో రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ను వైద్యులు చెక్‌ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. ఏప్రిల్‌ 1వ తేదీన జైలుకు తరలించిన రోజుతో పోలిస్తే ఇప్పుడు ఆయన చక్కెరస్థాయిలు రెట్టింపు అయినట్లు పేర్కొంది. అయితే ఈడీ ఆరోపణలను సీఎం తరఫు న్యాయవాది ఖండించారు. ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్‌ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్‌ ఛార్ట్‌పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది. అనంతరం పిటీషన్‌పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

2021-22 నాటి దిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం ఏప్రిల్‌ 23 వరకు పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని