Arif Mohammed Khan: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ సంచలన వ్యాఖ్యలు

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తనపై భౌతికదాడి చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Published : 12 Dec 2023 02:27 IST

తిరువనంతపురం: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ (Arif Mohammed Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) తనపై భౌతికదాడి చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. దిల్లీ పయనమయ్యేందుకు తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా.. తన వాహనంపై కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. వెంటనే ఆగ్రహంతో కారు దిగిన ఆరిఫ్‌ మహ్మద్‌.. ఇది ముఖ్యమంత్రి చేయించిన పనేనని, భౌతికంగా తనపై దాడి చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతున్నట్లు కనిపిస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

కేరళలో సీఎం, గవర్నర్‌ మధ్య చాలా కాలంగా వివాదం ఉన్నా.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ ఎడం మరింత పెరిగింది. కేరళలోని కన్నూర్‌ యూనివర్సిటీ ఉప కులపతిగా గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వ జోక్యాన్ని, రవీంద్రన్‌ను తిరిగి నియమిస్తూ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ఇచ్చిన ఉత్తర్వునూ తప్పు పట్టింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ స్పందిస్తూ.. రవీంద్రన్‌ను వీసీగా నియమించాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందును తప్పుపట్టడానికి కారణం లేదన్నారు. ఆ తర్వాత గవర్నర్‌ ఆరిఫ్‌ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సీఎం విజయన్‌ ఆరోపించడం చర్చనీయాంశమైంది. మీడియా ముందు గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా ఆయన ఈ విధంగా స్పందించారు. గవర్నర్‌గా ఆయన తన విధులు నిర్వర్తిస్తే చాలన్నారు. గవర్నర్‌ ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా తనకు చెప్పాలని, మీడియాతో కాదన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని