Kerala: సీఎం vs గవర్నర్‌.. కేరళలో మరోసారి మాటల యుద్ధం

CM vs Governor: కేరళలో రాజ్‌భవన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం మరింత పెరుగుతోంది. తాజాగా సీఎం, గవర్నర్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది.

Published : 07 Dec 2023 17:08 IST

కోచి: కేరళలో రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం మరింత పెరుగుతోంది. గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, సీఎం విజయన్‌ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తన విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సీఎం విజయన్‌ ఆరోపించారు. మీడియా ముందు గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా ఈ విధంగా స్పందించారు. గవర్నర్‌గా ఆయన తన విధులు నిర్వర్తిస్తే చాలన్నారు. గవర్నర్‌ ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా తనకు చెప్పాలని, మీడియాతో కాదన్నారు.

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు ఆర్డినెన్స్‌లపై సంతకం గురించి మీడియా ప్రతినిధులు బుధవారం గవర్నర్‌ వద్ద ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన సీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా బిల్లు, ఆర్డినెన్స్‌కు సంబంధించి అత్యవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం.. రాజ్‌భవన్‌ను సంప్రదించి వివరణ ఇవ్వాలన్నారు. మార్కిస్టు పార్టీ సభ్యులు, కార్యకర్తలు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ‘ఆజాద్‌ కశ్మీర్‌’ అని సంబోధించడం మానుకోవాలని, విభజన వాదానికి ఆజ్యం పోయకూడదన్నారు. దీనిపై విజయన్‌ స్పందించారు.

ఉత్తమ్‌కి హోం.. భట్టికి రెవెన్యూ.. మంత్రులకు శాఖల కేటాయింపు..

కేరళలో సీఎం, గవర్నర్‌ మధ్య చాలా కాలంగా వివాదం ఉన్నా.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మరింత ఎడం పెరిగింది. కేరళలోని కన్నూర్‌ యూనివర్సిటీ ఉప కులపతిగా గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వ జోక్యాన్ని, రవీంద్రన్‌ను తిరిగి నియమిస్తూ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ఇచ్చిన ఉత్తర్వునూ తప్పు పట్టింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ స్పందిస్తూ.. రవీంద్రన్‌ను వీసీగా నియమించాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందును తప్పుపట్టడానికి కారణం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు