ఆ గ్యాంగ్‌స్టర్‌ను చంపితే రూ.20లక్షలు ఇస్తామని.. రూ.8వేలే చేతిలో పెట్టి..

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన గ్యాంగ్‌స్టర్ జీవా హత్య కేసు నిందితుడు విచారణలో ఆసక్తికర విషయం వెల్లడించాడు. అలాగే సుపారీ మొత్తం గురించి తెలిపాడు. 

Updated : 17 Jun 2023 16:55 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని లఖ్‌నవూ కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగా గ్యాంగ్‌స్టర్‌ సంజీవ్‌ మహేశ్వరి జీవాను మరో దుండగుడు కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాల్పుల అనంతరం నిందితుడు విజయ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు విచారణలో భాగంగా అతడు ఆసక్తికర విషయం వెల్లడించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

‘సంజీవ్‌ మహేశ్వరి జీవాను హత్య చేసేందుకు నాకు రూ.20 లక్షల సుపారీ ఇచ్చారు. పనిపూర్తయిన తర్వాత ఆ మొత్తం ఇస్తామని చెప్పారు. కానీ రూ.8 వేలు మాత్రమే అందాయి’ అని విజయ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఈ హత్యకు సుపారీ ఇచ్చిన వ్యక్తుల వివరాలను నిందితుడు వెల్లడించడంలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అలాగే అనుమానితులు, జీవాతో వైరం ఉన్న వ్యక్తుల ఫొటోలు చూపించినా సరే, వాటిని చూసి గుర్తించడానికి అతడు నిరాకరిస్తున్నట్లు చెప్పాయి. తానొక్కడే ఒంటరిగా హత్యను చేసినట్టు,  తనకు ఎవరూ సహకరించలేదని విజయ్‌ విచారణలో చెప్పినట్లు తెలిపాయి. అతడు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఈ నెల మొదట్లో జీవా హత్య జరిగింది. అతడు పశ్చిమ యూపీలో క్రిమినల్‌ గ్యాంగ్‌ నడిపేవాడు. జీవా వివాదాస్పద నేత ముఖ్తార్‌ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. 1997లో జరిగిన ఎమ్మెల్యే బ్రహ్మదత్‌ ద్వివేది హత్యకేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా.. సహ నిందితుడిగా జీవాపై కేసు నమోదైంది. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్యకేసులోనూ నిందితుడైన జీవాపై మరో 24 ఇతర కేసులు ఉన్నాయి. వాటిలో ఓ కేసుకు సంబంధించి అతణ్ని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ హత్య జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని