Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ల హత్య కేసు.. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు

ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్ల (Atiq Ahmad) హత్య కేసు సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ఐదుగురి స్థానిక పోలీసులపై యూపీ ప్రభుత్వం (UP Police) సస్పెన్షన్‌ వేటు వేసింది.

Updated : 19 Apr 2023 19:03 IST

ప్రయాగ్‌రాజ్‌: గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఆ ఘటన చోటుచేసుకోకుండా నిరోధించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దర్యాప్తు జరిపిన యూపీ ప్రభుత్వం.. ఐదుగురు పోలీసులపై (UP Police) సస్పెన్షన్‌ వేటు వేసింది.

షాహగంజ్‌ పోలీస్‌ సీనియర్‌ అధికారి అశ్వని కుమార్‌ సింగ్‌తోపాటు ఓ ఇన్‌స్పెక్టర్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుకు సంబంధించి ఈ ఐదుగురు పోలీసులను ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT).. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించింది. ఈ ఐదుగురు పోలీసులు కూడా షాహగంజ్‌ పోలీస్‌ స్టేషన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా హత్య జరిగిన మెడికల్‌ కాలేజీ ప్రాంతం ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకే వస్తుంది.

వైద్య పరీక్షల కోసం అతీక్‌, అష్రాఫ్‌లను మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్చారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వారిని ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో ప్రవేశపెట్టగా నాలుగురోజుల పాటు పోలీస్‌ కస్టడీ విధించింది. ఇప్పటికే ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన దర్యాప్తు బృందం.. సీన్‌ రీక్రియేషన్‌ చేపట్టేందుకు సిద్ధమైంది.

మరోవైపు ఈ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరగడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని సమాజ్‌వాదీ, ఎంఐఎం అగ్రనేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని