Marriage: హద్దులు దాటి వధువుకు ‘కిస్సు’.. కర్రలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు

కల్యాణ వేదికపై బహిరంగంగా వధువును వరుడు ముద్దుపెట్టుకోవడం వివాదాన్ని రాజేసింది. ఇరు కుటుంబీకులు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.  

Updated : 23 May 2024 17:35 IST

లఖ్‌నవూ: వరుడి విపరీత చర్యతో కల్యాణ వేదిక రణరంగంగా మారింది. వరమాల క్రతువు పూర్తయిన తర్వాత వధువును అతడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వివాదానికి కారణమైంది. చివరకు ఇరువర్గాల వారు కర్రలతో దాడి చేసుకునేవరకు వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్‌లోని అశోక్‌నగర్‌లో ఏర్పాటుచేశాడు. ఒక కుమార్తె వివాహం ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్తయింది. అది పూర్తయిన కొద్దిసేపటి తర్వాత మరో కుమార్తె లగ్నం జరుగుతోంది. వరమాల వేయడం పూర్తయిన తర్వాత వరుడు, వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టాడు. ఇది ఆమె బంధువులకు నచ్చలేదు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అంతలోనే వధువు బంధువులు కొందరు స్టేజీ పైకి చేరుకొని వరుడు, అతడి కుటుంబసభ్యులపైన దాడికి దిగారు. ఇరువర్గాల వారు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో కల్యాణవేదిక కాస్తా, రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులైన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె నిరాకరిస్తున్నా అందరిముందు ముద్దు పెట్టుకున్నాడని వధువు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమె అంగీకారంతోనే ముద్దు పెట్టానని వరుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధితులెవరైనా ముందుకొస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అయితే, ప్రజాశాంతికి భంగం కలిగించినందుకుగాను ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని