Bangladesh MP: అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ మృతదేహం కోల్‌కతాలో గుర్తింపు.. హత్యగా అనుమానాలు!

వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఎంపీ ఆచూకీ గల్లంతైంది. తాజాగా ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. 

Updated : 22 May 2024 12:00 IST

కోల్‌కతా: వైద్యచికిత్స నిమిత్తం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (Anwarul Azim Anar) కొద్దిరోజుల క్రితం అదృశ్యమయ్యారు. అయితే ఆయన మృతి చెందినట్లు బుధవారం వ్యక్తిగత కార్యదర్శి అబ్దుర్ రవూఫ్‌ వెల్లడించారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌లోని ఖాళీ ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత ఎనిమిది రోజులుగా పశ్చిమ బెంగాల్‌ పోలీసులు, బంగ్లాదేశ్‌ అధికారులు ఆయన కోసం గాలించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ (Anwarul Azim) చికిత్స నిమిత్తం పశ్చిమ బెంగాల్‌ వచ్చారు. దర్శనా సరిహద్దు ద్వారా మే 12న బారానగర్‌లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్‌ ఇంట్లో బసచేశారు. వెంటనే వస్తానంటూ రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లారని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, ఆయన ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో స్నేహితుడితో పాటు బంగ్లాదేశ్‌లోని ఎంపీ కుటుంబ సభ్యులు ఫోన్లు చేశారు. ఎవరి కాల్స్‌కు ఆయన సమాధానం ఇవ్వలేదు. మే 14 నుంచి ఆయన ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోంది. దాంతో వెంటనే బిశ్వాస్‌ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజీమ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా దృష్టికి తీసుకెళ్లారు. మరోపక్క భారత్‌లోని దౌత్యవేత్తలకు సమాచారం ఇచ్చారు. నాటి నుంచి గాలిస్తుండగా.. ఈ రోజు ఆయన మృతదేహం లభ్యమైంది. అయితే, అది హత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అజీమ్‌ ఫోన్‌లో బంగ్లాదేశ్‌ సిమ్‌తో పాటు భారత్‌ సిమ్ కూడా ఉంది. రెండు నంబర్లు పనిచేయకపోవడంతో ఆయన జాడ గుర్తించడం ఆలస్యమైంది. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్‌ ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో నిన్న ఎంపీ కుమార్తె ముమ్తారిన్ ఫిర్దౌస్‌ ఫిర్యాదు చేశారు. ఆ దేశ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ.. ఆ నేత ఫోన్ కొన్నిసార్లు స్విచ్ఛాప్‌, స్విచ్ఛాన్ అవుతోందన్నారు. అయితే ఆయన్ను కాంటాక్ట్ అవడం మాత్రం సాధ్యం కాలేదన్నారు. జెనైదా-4 నియోజక వర్గానికి అజీమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని