Kumaraswamy: ప్రజ్వల్‌ ఇకనైనా లొంగిపో.. కుమారస్వామి విజ్ఞప్తి

హాసన సెక్స్‌స్కాండల్‌లో కీలక నిందితుడైన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ భారత్‌కు తిరిగి రావాలని అతడి బాబాయి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మరోసారి విజ్ఞప్తి చేశారు.

Published : 22 May 2024 19:32 IST

బెంగళూరు: వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని లైంగిక దౌర్జన్యాల కేసులో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్‌కు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) బాబాయి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) మరోసారి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చి విచారణను ఎదుర్కోవాలని కోరారు. ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణల విషయంలో తమ పార్టీకి, భాజపాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ఈ కేసుకు పొత్తుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. 

ప్రజ్వల్ ఏప్రిల్ 27న దౌత్యపరమైన పాస్‌పోర్టుతో జర్మనీకి వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హాసన్‌ నియోజకవర్గ ఎన్నికలు జరిగిన మరునాడు విదేశాలకు వెళ్లిన ప్రజ్వల్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు. 

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటుచేసింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని వీరిద్దరికీ సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకు వారం రోజుల సమయం కావాలని ప్రజ్వల్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన దర్యాప్తు బృందం ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది. దీంతో ప్రజ్వల్‌ దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. 

ప్రజ్వల్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు కుమారస్వామి మాట్లాడుతూ ‘‘అతడు కర్ణాటకలో ఉన్నప్పుడే నా దగ్గరికి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు విదేశాల్లో ఉండి నాతో మాట్లాడతాడా. నేను ఇప్పటికే నాపైనా, హెచ్‌డీ దేవేగౌడపైన గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని, విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశాను. ఇప్పటికైనా లొంగిపోవాలని మళ్లీ ప్రజ్వల్‌ను కోరుతున్నాను. నా మాటను గౌరవించి ప్రజ్వల్‌ తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ప్రజ్వల్‌ ఎక్కడ ఉన్నాడో అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు కూడా తెలియదు. ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేడు. కొందరు న్యాయవాదుల సలహాతో విదేశాలకు వెళ్లాడని తెలిసింది’’అని అన్నారు. 

నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజ్వల్‌ ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లాడని తెలిపారు. ఒక వారంలో వచ్చి విచారణకు హాజరవుతానని ప్రకటించిన అనంతరం అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో భారత్‌కు వచ్చేందుకు వెనకడుగువేసి ఉండవచ్చని పేర్కొన్నారు. కొందరు వ్యాపారవేత్తలు ప్రజ్వల్‌కు సహాయం చేస్తున్నారనే వార్తలపై కుమారస్వామి స్పందిస్తూ తనకు ఆ విషయం గురించి తెలియదన్నారు. తమ కష్టాలు పంచుకోవడానికి ప్రజలు తప్ప తన వద్దకు ఏ వ్యాపారవేత్త రారని అన్నారు. ఇలాంటి కేసులతో దేవెగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని