ED: రైల్వే ఉద్యోగాల కుంభకోణం.. రూ.600 కోట్ల ఆస్తుల గుర్తింపు!

రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో శుక్రవారం జరిపిన దాడుల్లో.. లెక్కచూపని రూ.కోటి నగదు, ఈ కేసుకు సంబంధించి రూ.600 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ‘ఈడీ’ వెల్లడించింది. లాలూప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Published : 11 Mar 2023 22:54 IST

దిల్లీ: రైల్వే ఉద్యోగాల కుంభకోణం(Land For Job Scam) వ్యవహారంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుటుంబ సభ్యులు, ఆర్జేడీ నేతల ఇళ్లలో శుక్రవారం ఈడీ(ED) సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. దిల్లీ, బిహార్‌, ముంబయిల్లో మొత్తం 24 చోట్ల తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి చేపట్టిన ఈ సోదాల్లో లెక్కచూపని రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం వెల్లడించింది. దీంతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న దాదాపు రూ.600 కోట్ల విలువైన ఆస్తులనూ గుర్తించినట్లు తెలిపింది. లాలూ కుటుంబం, వారి సహచరుల తరఫున రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాల్లో పెట్టిన మరిన్ని పెట్టుబడులను వెలికితీసేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది.

లాలూ రైల్వే మంత్రిగా ఉన్న 2004- 09 మధ్య కాలంలో రైల్వేలో ‘గ్రూప్‌- డి’ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుతో ముడిపడ్డ మనీలాండరింగ్‌ వ్యవహారాలపై దర్యాప్తులో భాగంగా ‘ఈడీ’ ఈ మేరకు చర్యలు చేపట్టింది. లాలూ తనయుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మరోవైపు.. ఈ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ శనివారం తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసింది. అయితే, గర్భిణీ అయిన తన భార్య ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న కారణంగా విచారణకు రాలేనని సీబీఐకి ఆయన సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని