Simultaneous Polls: 2029 నుంచే జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌..!

Simultaneous Polls: జమిలి ఎన్నికలను 2029 నుంచి నిర్వహించాలని లా కమిషన్‌ ప్రతిపాదనలు చేసే అవకాశముంది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్తగా చాప్టర్‌ను చేర్చేందుకు ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Published : 28 Feb 2024 17:54 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జమిలి ఎన్నికల (Simultaneous Polls)పై కొంతకాలంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఇటీవల కేంద్రం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’పై కమిటీని కూడా వేసింది. ఈనేపథ్యంలోనే ‘జమిలి’ నిర్వహణపై లా కమిషన్‌ (Law Commission) త్వరలోనే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి.

2029 మే-జూన్ మధ్య ఏకకాల ఎన్నికలు నిర్వహించేలా ‘లా కమిషన్‌’ ప్రతిపాదించనుంది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చేలా సవరణలకు కమిషన్‌ సిఫార్సు చేయనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అలాగైతే 19వ లోక్‌సభకు నిర్వహించే సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహంచే వీలు ఉంటుందని కమిషన్‌ అభిప్రాయపడుతున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

లా కమిషన్‌ చేయనున్న సిఫార్సుల్లోని ముఖ్యాంశాలివే..

  • రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్‌లో ఏకకాల ఎన్నికలు, వాటి సుస్థిరత, లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు ఉండాలి.
  • అసెంబ్లీలకు సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త చాప్టర్‌ను రూపొందించాలి.
  • జమిలి ఎన్నికలకు వీలుగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను మూడు దశల్లో సర్దుబాటు (కొన్నింటి కాల వ్యవధిని పొడిగించడం, కొన్నింటికి తగ్గించడం) చేయాలి.
  • ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలిపోయినా లేదా హంగ్‌ ప్రభుత్వాలు ఉన్నా.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ‘ఐక్య ప్రభుత్వాన్ని’ ఏర్పాటుచేయాలి. ఈ ఫార్ములా పని చేయకపోతే.. అసెంబ్లీ మిగతా కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ సిఫార్సులు చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని