LS Election Results: ఎన్నికల ఫలితాలు చెప్పిన 6 జీవిత పాఠాలు.. IFS అధికారి పోస్ట్‌ వైరల్‌

LS Election Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి మనం కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోవాలని అంటున్నారో ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Published : 06 Jun 2024 13:37 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల మహా సమరం ముగిసింది. ఎన్నికల ముందు ‘అబ్‌ కీ బార్‌.. 400 పార్‌’ అన్న ఎన్డీయే కూటమి 293 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ రాకపోయినా ఈ ఎన్నికల్లో (Lok Sabha Elections) ‘ఇండియా కూటమి’ మెరిపించింది. ఫలితాలు వెలువడిన నాటి నుంచి వాటిపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి (IFS Officer) చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఈ ఫలితాల నుంచి మనం కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని అంటున్నారాయన..! అవేంటో చూద్దాం..

‘‘భాజపా (BJP)కు 240 సీట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీ ఓడిపోయినట్లే భావిస్తోంది. కాంగ్రెస్‌ (Congress)కు దాదాపు 100 సీట్లు వచ్చినా గెలిచామని అనుకుంటోంది. ఈ ఎన్నికల ఫలితాల నుంచి మనం ఆరు జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి హిమాన్షు త్యాగీ (Himanshu Tyagi) తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆయన చెప్పిన ఆరు పాఠాలు ఇలా..

1. మిమ్మల్ని మీరు ఉదాసీనంగా తీసుకోవద్దు. మీరు అత్యుత్తమం అయినప్పటికీ మిమ్మల్ని మీరు నిరంతరం మెరుగుపర్చుకోవాలి.

2. జీవితంలో మీ నియంత్రణలో లేని అంశాలు (కుల, మత ఆధారిత ఓటింగ్‌ను ఉద్దేశిస్తూ) కొన్ని ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నించినా కాలగమనాన్ని మార్చలేరు.

3. ఫెయిలయ్యారా..! ఆ ఓటమి నుంచి నేర్చుకోండి. ఎప్పుడూ ప్రయత్నాన్ని వదలొద్దు. తప్పకుండా అనుకూల పవనాలు వీస్తాయి.

4. మీ విశ్వసనీయత సంబంధం లేకుండా.. కొన్నిసార్లు అకారణంగా, అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వస్తుంది. (అమేఠీలో ప్రముఖుల ఓటమిని ఉద్దేశిస్తూ)

5. మీరు కఠినమైన పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు ఇతర వ్యక్తుల సాయం తీసుకోండి. బృందంగా ఏర్పడండి.

6. కాలం మారుతుంది. కాబట్టి మీ వ్యూహాలను కూడా అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. పరిస్థితులను బట్టి మీ విధానాల్లో మార్పులు చేసుకోవాలి. (నేటి రోజుల్లో అభివృద్ధి అంశాలకే ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు)

అంటూ త్యాగి వరుస పోస్ట్‌లు చేశారు. ప్రస్తుతం ఈ ఎక్స్‌ ‘థ్రెడ్‌’ నెట్టింట వైరల్‌గా మారింది. సరిగ్గా చెప్పారంటూ పలువురు ఆయనను అభినందిస్తున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన హిమాన్షు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. గతంలో యూపీఎస్సీ అభ్యర్థులకు కొన్ని టిప్స్‌ చెప్పి వార్తల్లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని