స్కూల్‌ టీచర్‌ టు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌.. వారంలోనే మారిన జీవితం!

కొద్ది వారాల క్రితం వరకు ఆమె సాధారణ స్కూల్‌ టీచర్‌. ప్రస్తుతం ఆమె మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే తన భర్త ఆశయాన్ని సైతం నెరవేర్చారు. ఇంతకీ అదెలా సాధ్యమైందంటే. 

Published : 16 May 2023 23:28 IST

లఖ్‌నవూ: జీవితం ఎప్పుడు? ఎలా? మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. మొన్నటిదాకా పాఠశాల ఉపాధ్యాయురాలిగా (Teacher) పనిచేసిన ఆమె వారాల వ్యవధిలోనే మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా (Muncipal Chairperson) ఎన్నికయ్యారు. ప్రజలకు సేవ చేయాలనే తన భర్త కోరికను నెరవేర్చారు. అదెలా సాధ్యమైందంటే..

ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని రాంపూర్‌ (Rampur)కు చెందిన మమున్‌ షా (Mamun Shah).. గత 20 ఏళ్లుగా స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆయన రాంపూర్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాంపూర్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్థానం మహిళలకు రిజర్వ్‌ అయింది. అయితే, ముమన్‌ షా బ్యాచిలర్‌ కావడంతో ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ 45 ఏళ్ల బ్యాచిలర్‌ వెంటనే వివాహం చేసుకుని తన భార్యను ఎన్నికల్లో నిలబెట్టాలనుకున్నాడు. 

రాంపూర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సనా ఖాన్‌ (Sana Khanam)తో ఏప్రిల్‌ 13న వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీటు నిరాకరించడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాడు. సనాను వివాహం చేసుకుని ఏప్రిల్‌ 16న ఆప్‌ అభ్యర్థిగా ఆమె చేత నామినేషన్‌ దాఖలు చేయించాడు. ఈ ఎన్నికల్లో సనా ఖాన్‌ విజయం సాధించడంతో, ఆమె మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ‘‘ప్రచార సమయంలో ప్రజల సమస్యలను దగ్గర్నుంచి చూశాను. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ఇప్పటి వరకు టీచర్‌గా ఉన్న నేను, మున్సిపల్‌ ఛైర్మపర్సన్‌గా ఎన్నికవడంపై నా బంధువులు, విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు’’ అని తెలిపారు. 

‘‘ఈ ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నా భార్య  తొలిసారి పోటీ చేస్తుండటం, ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో గెలుపు కష్టమవుతుందని అనుకున్నా. కానీ, నాపై నమ్మకంతో గెలిపించిన రాంపూర్‌ ప్రజలందరీ ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని ముమన్‌ షా అన్నారు. రాంపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలు మే 4న జరగ్గా.. ఫలితాలను మే13న ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని