Loksabha elections: 16న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్న ఈసీ

Loksabha elections schedule: లోక్‌సభ ఎన్నికలకు ఈ నెల 16న నగారా మోగనుంది. ఈ మేరకు ఈసీ అధికారికంగా వెల్లడించింది.

Updated : 15 Mar 2024 19:39 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) నగారా మార్చి 16న మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా (ECI) సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. లోక్‌సభతో పాటుగానే.. ఆంధ్రప్రదేశ్‌ (AP Assembly Elections) సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ తేదీలను ప్రకటించనున్నారు.

ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.

గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌ - మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని