Nafe Singh Rathi: ఐఎన్‌ఎల్‌డీ అధ్యక్షుడిని హత్య చేసింది మేమే: యూకే గ్యాంగ్‌స్టర్‌

ఐఎన్‌ఎల్‌డీ అధ్యక్షుడు నఫే సింగ్‌ రాఠీ హత్య వెనక తమ హస్తం ఉన్నట్లు యూకేలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్‌ కపిల్‌ సంగ్వాన్‌ పేర్కొన్నాడు.  

Published : 29 Feb 2024 00:24 IST

చండీగఢ్‌: హరియాణా రాష్ట్ర ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్ (INLD) పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్‌ రాఠీని తమ గ్యాంగే హత్య చేసినట్లు యూకేలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్‌ కపిల్‌ సంగ్వాన్‌ పేర్కొన్నాడు. తన శత్రువు గ్యాంగ్‌స్టర్‌ మంజీత్‌ మహల్‌తో నఫేకు ఉన్న స్నేహమే ఇందుకు కారణమని తెలిపాడు. హరియాణా (Haryana)లోని బజ్జర్‌ జిల్లాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో నఫే సింగ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. నఫే సింగ్‌ కారులో వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నఫే సింగ్‌ రాఠీతో సహా మరో కార్యకర్త మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనకు సంబంధించి తాజాగా గ్యాంగ్‌స్టర్‌ కపిల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఆస్తుల కబ్జాల్లో మంజీత్‌ మహల్‌ సోదరుడు సంజయ్‌తో నఫే సింగ్‌ కలిసి పనిచేసేవాడని ఆరోపించాడు. తన బావ, స్నేహితుల హత్యలకు సంబంధించి మంజీత్‌కు నఫే మద్దతు ఇచ్చాడని పేర్కొన్నాడు. నా శత్రువులతో చేతులు కలిపిన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. నా శత్రువులకు మద్దతు ఇస్తే నేను వారి శత్రువులతో కలుస్తాను. వారి ప్రాణాలు తీయడానికి 50 బుల్లెట్లు ఎప్పటికీ వేచి ఉంటాయి అని పేర్కొన్నాడు. నఫే అధికారంలో ఉన్నప్పుడు అతడు ఎంతో మందిని  చంపాడని, ఈ విషయం అందరికీ తెలుసని అన్నాడు. తన బావ, స్నేహితుల హత్యల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటే విషయం ఇక్కడిదాకా వచ్చి ఉండేది కాదన్నాడు. 

మరోవైపు నఫేను హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్య కేసును తీవ్రంగా తీసుకున్న  హరియాణా ప్రభుత్వం విచారణను సీబీఐకి అప్పగించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు