వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ లోయలో పడిన వాహన ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలానని ఆవేదన వ్యక్తంచేశాడు.

Published : 22 May 2024 00:06 IST

ఛత్తీస్‌గఢ్‌: 40 మందికి పైగా ప్రయాణిస్తున్న ఓ వాహనం ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని ఓ లోయలో పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృత్యువాత పడినట్లు వెల్లడైంది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ బాధితుడు, తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలానని వాపోయాడు. ఆ భయానక ఘటనను వివరించాడు. కబీర్‌ధామ్‌ జిల్లా బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

‘‘అడవిలోకి వెళ్లి బీడీ ఆకులు సేకరించి మూటలతో అందరం వాహనంలో తిరిగి పయనమయ్యాం. కొందరు మహిళలు, పురుషులు, చిన్నారులు కూడా అందులో ఉన్నారు. నేను డ్రైవర్‌ పక్కన కూర్చున్నా. ఆ సమయంలో బ్రేక్‌లు ఫెయిల్‌ అవడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెనక కూర్చున్నవారిని కిందికి దూకేయమని అప్రమత్తం చేశాం. ఓ రాయి మీదకి ఎక్కించి వాహనాన్ని అదుపు చేయాలనుకున్నాం. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. నేనూ కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నా. అందరూ వాహనం నుంచి దూకే లోపే జరగాల్సిన నష్టం జరిగింది. నా భార్య సహా నా కుటుంబంలో 10 మందిని ఈ ప్రమాదంలో పోగొట్టుకున్నా’’ అని పరిస్థితిని వివరించాడు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌సాయి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని