Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల వేళ.. ఈసీ బదిలీల వేటు

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతకు భంగం కలగకుండా చూసేందుకు ఆ  దిశగా కేంద్ర ఎన్నికల సంఘం(ECI) కఠిన చర్యలు తీసుకుంటోంది. 

Updated : 21 Mar 2024 13:21 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ECI) బదిలీల వేటు కొనసాగిస్తోంది. తాజాగా అస్సాం, పంజాబ్‌లోని జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారుల్ని(district police chiefs) బదిలీ చేసింది. ప్రముఖ రాజకీయ నాయకులతో బంధుత్వం ఉన్న అధికారులను ఆ విధుల నుంచి పక్కనపెట్టామని తెలిపింది. ఆ పోస్టులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్ అధికారులకు కేటాయించినవి కావడంతో ఈ చర్యలు తీసుకుంది. అలాగే పంజాబ్‌, ఒడిశా, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో నాన్‌ ఎన్‌కేడర్‌ జిల్లా మేజిస్ట్రేట్లు(DM), ఎస్పీ(SP)లను ఇతర విభాగాలకు మార్చాలని ఆయా ప్రభుత్వాలకు సూచించింది. (Lok Sabha Elections)

ఇటీవల పశ్చిమ్‌ బెంగాల్‌ డీజీపీతో పాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించిన సంగతి తెలిసిందే. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. ఎన్నికలకు సంబంధంలేని విధులకు డీజీపీ రాజీవ్‌ కుమార్‌ను బదిలీ చేయాలని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. ఆయనకు జూనియర్‌గా ఉన్న అధికారిని డీజీపీగా తాత్కాలికంగా నియమించాలని సూచించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ హోంశాఖల కార్యదర్శులపైనా ఈసీ వేటు వేసింది. వీరంతా ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మరో చోట విధులను నిర్వర్తిస్తున్నారని పేర్కొంది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతకు భంగం కలుగుతుందని భావించినట్లు వెల్లడించింది. కాగా, ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని