Parliament: రాహుల్‌ ‘అనర్హత’పై దద్దరిల్లిన పార్లమెంట్‌.. నిమిషానికే ఉభయసభలు వాయిదా

పార్లమెంట్‌ (Parliament)లో మరోసారి వాయిదాల పర్వం నెలకొంది. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అనర్హత సహా పలు అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు స్తంభించాయి.

Updated : 27 Mar 2023 12:57 IST

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దుకు నిరసనగా పార్లమెంట్‌ (Parliament)లో ప్రతిపక్షాలు సోమవారం ఆందోళనలకు దిగాయి. రాహుల్‌పై అనర్హత వేటు (Disqualification), అదానీ వ్యవహారంపై విపక్ష సభ్యులు గట్టిగట్టిగా నినాదాలు చేశాయి. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ప్రారంభమైన కేవలం నిమిషానికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ (Rajya Sabha)ను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖఢ్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభను (Lok sabha) స్పీకర్‌ ఓం బిర్లా సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు.

నల్ల దుస్తుల్లో విపక్ష ఎంపీలు..

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్‌ (Congress) సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా నేడు నల్లదుస్తుల్లో పార్లమెంట్ (Parliament) సమావేశాలకు హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో విపక్ష ఎంపీలు భేటీ అయి.. రాహుల్‌ ‘అనర్హత’పై ప్రతిపక్షాల ఉమ్మడి వ్యూహం గురించి చర్చించారు.

సమావేశానికి తృణమూల్‌, భారాస కూడా..

ఖర్గే కార్యాలయంలో సమావేశానికి డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీలో తృణమూల్‌ కాంగ్రెస్‌, భారాస కూడా పాల్గొనడం గమనార్హం. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష కూటమికి గత కొంతకాలంగా టీఎంసీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలో భారాస, కాంగ్రెస్‌ ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు పార్టీలు కలిసి నేడు సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని