Madhya Pradesh: అదృశ్యమైన బాలికలు సేఫ్‌.. మధ్యప్రదేశ్‌ సీఎం

వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలు సురక్షితంగా ఉన్నట్లు మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ప్రకటించారు. 

Published : 07 Jan 2024 02:14 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాజధాని భోపాల్‌(Bhopal) శివారులో వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలు క్షేమంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ప్రకటించారు. రాజధానికి 20 కి.మీ దూరంలోని పర్వాలియా ప్రాంతంలో ఉన్న ఆంచల్‌ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారన్న ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి వారు ఎక్కడున్నారో కనుక్కున్నారు. ఈ సంఘటనపై సీఎం మోహన్‌ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. కనిపించకుండా పోయిన బాలికలను గుర్తించినట్లు తెలిపారు. అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహాలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వసతి గృహాలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్‌ కనుంగో ఈ వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ చేయగా బాలికలు అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 68 మంది బాలికల్లో 26 మంది తక్కువగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించారు. వసతి గృహం డైరెక్టర్‌ను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటిపై బెంగతోనే బాలికలు తమ నివాసాలకు వెళ్లారని భావిస్తున్నట్లు భోపాల్‌ రూరల్‌ ఎస్పీ ప్రమోద్‌ కుమార్‌ సిన్హా మీడియాకు తెలిపారు. బాలికల అదృశ్యమైన వార్తలపై అంతకుముందు భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని