Padma Shri: రూ.20తో పేదలకు వైద్యం..ఎందరికో ఆదర్శప్రాయం

రూ. 20 నామమాత్రపు రుసుముతో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న విశ్రాంత సైనిక వైద్యుడు దావర్‌ను పద్మశ్రీ వరించింది. ఆయన జీవనయానం ఎందరికో ఆదర్శప్రాయం.

Published : 26 Jan 2023 16:46 IST

జబల్‌పూర్‌: పేదలకు సేవ చేయాలన్న సంకల్పం వెనకడుగు వేయనివ్వలేదు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా రూ.2కే వైద్యసేవలు అందించడం మొదలు పెట్టారు. ఇప్పటికీ రూ.20కే వైద్యం చేస్తున్న అతడిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయనే మధ్యప్రదేశ్‌కు చెందిన విశ్రాంత సైనిక వైద్యుడు మునీశ్వర్‌ చందర్‌ దావర్‌. పేద ప్రజలపై ఆయనకున్న ప్రేమ, సేవ చేయాలనే ప్రగాఢ వాంఛ, జీవనయానం ఎందరికో ఆదర్శప్రాయం.

దావర్‌ 1946, జనవరి 16న పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. స్వాతంత్య్రం అనంతరం భారత్‌ నుంచి పాక్‌ విడిపోయిన తర్వాత ఆయన కూడా ఇండియాకు వచ్చేశారు. 1967లో జబల్‌పూర్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత 1971 భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో ఏడాది పాటు సైనిక వైద్యుడిగా సేవలందించారు. ఆయన సర్వీసులో ఉన్నప్పుడే సెలవుల్లో వచ్చి చుట్టుపక్కల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే వారు. పదవీ విరమణ చేసిన తర్వాత జబల్‌పూర్‌లో ఉంటున్న పేదలకు కేవలం రూ.2 నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి నిరంతరాయంగా వైద్యసేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కేవలం రూ.20 మాత్రమే ఫీజు తీసుకోవడం గమనార్హం.

ఇంత తక్కువ ఫీజుతో సేవలు అందించడం ఆయన బంధువులు కొందరికి నచ్చలేదు. ఇంకొందరు వద్దని వారించారు. అయినప్పటికీ వారి వాదనను సున్నితంగా తిరస్కరించిన దావర్‌.. తన మనసు చెప్పిన విధంగా ముందుకెళ్లారు. పేద ప్రజలకు తక్కువ ఫీజుతోనే వైద్య సేవలు అందిస్తూ వారి మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. పేదవారి పట్ల ఆయనకున్న అభిమానాన్ని, ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం తాజాగా ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

ఆలస్యమైనా గుర్తింపు తథ్యం

భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన తర్వాత ఆయన తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. కష్టపడి పని చేస్తే కచ్చితంగా గుర్తింపు వస్తుందన్నారు. అయితే కొన్ని సార్లు అది ఆలస్యం కావొచ్చన్న ఆయన.. ప్రజల ఆశీస్సుల వల్లే ఈ పురస్కారం వరించిందని అన్నారు. ‘‘ తక్కువ ఫీజు  తీసుకుంటుండటంపై మా ఇంట్లో చాలా సార్లు చర్చ జరిగింది. కానీ, పేద ప్రజలకు సేవ చేయాలన్న నా కోరికను కుటుంబ సభ్యులంతా అర్థం చేసుకున్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. అందుకే ఫీజును పెంచలేదు. ఓపికతో కష్టపడి పని చేస్తే.. విజయం సాధించడం పక్కా. దీని వల్ల ఎంతో గౌరవం దక్కుతుంది’’ అని అంటున్నారు దావర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని