Mahadev betting app scam: మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌పై నిషేధం.. కేంద్రం నిర్ణయం

మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 

Published : 05 Nov 2023 22:28 IST

దిల్లీ: ఈడీ (Enforcement Directorate) దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌ను నిషేధించింది. దాంతోపాటు మరో 21 రకాల సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌సైట్లను నిషేధించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో మహదేవ్‌, రెడ్డీఅన్నప్రెస్టోప్రో’ ఉన్నాయని పీఐబీ పేర్కొంది. 

‘చట్టవిరుద్ధమైన సిండికేట్‌ బెట్టింగ్‌ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తును అనుసరించి ఈ చర్యలు తీసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ మహదేవ్‌కు సంబంధించిన పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఆ యాప్‌ ద్వారా నిర్వాహకులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిసింది’ అని ప్రభుత్వం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తనను యూఏఈ వెళ్లాలని చెప్పారంటూ యాప్‌ కేసులో నిందితుడు శుభం సోనీ దుబాయి నుంచి ఓ వీడియో విడుదల చేసిన రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్‌తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం ఉందంటూ ఈడీ ఆరోపించడం కలకలం రేపుతోంది. 

దిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత.. రంగంలోకి ఫైరింజన్లు

చట్టవిరుద్ధమైన యాప్‌పై చర్యలు తీసుకునే అధికారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ పని చేయలేదని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమర్శించారు. ‘ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 69ఎ ప్రకారం వెబ్‌సైట్‌ను నిషేధించాలని ప్రతిపాదించే అధికారం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఉంది. కానీ, తొలుత ఈడీ నుంచి మాత్రమే ఆ అభ్యర్థన వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని