RajyaSabha: రాజ్యసభలో గరం గరం.. ఖర్గే, గోయల్‌ మాటల తూటాలు!

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మధ్య రాజ్యసభలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇద్దరు నేతలూ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.

Published : 02 Feb 2024 21:24 IST

దిల్లీ: బిహార్‌ (Bihar), ఝార్ఖండ్‌ (Jharkhand) రాష్ట్రాల్లో ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభంపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేసిన తర్వాత.. ఝార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు 2 రోజుల సమయం పట్టగా.. బిహార్‌లో మాత్రం ఈ ప్రక్రియ గంటల వ్యవధిలోనే జరిగిపోయిందని ఖర్గే అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌.. ఆ చేత్తో రాజీనామా లేఖ ఇచ్చి.. ఈ చేత్తో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ఝార్ఖండ్‌లో భాజపా కుతంత్రాలు పని చేయలేదని ఎద్దేవా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ కూడా నిబంధనల మేరకు నడుచుకోలేదని ఆరోపించారు.

‘ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్‌ కోరాలి. అది లేదు సరికదా.. కనీసం సీఎం రాజీనామా చేసినట్లు రాజ్‌భవన్‌ ప్రకటన కూడా విడుదల చేయలేదు’ అని ఖర్గే అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు జేఎంఎం సారథ్యంలో సంకీర్ణ పక్షాల ఎమ్మెల్యేలు అనుమతి కోరితే తాత్సారం చేశారని ఆరోపించారు. రాజీనామాకు ముందే హేమంత్‌ సోరెన్‌ శాసనసభాపక్ష నేతగా చంపయీ సోరెన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన సీఎంగా ప్రమాణం చేసేందుకు 2 రోజుల సమయం పట్టిందన్నారు.

దీనిపై పీయూష్‌ గోయల్‌ స్పందిస్తూ.. అవినీతి కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు.  మనీలాండరింగ్‌ కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన హేమంత్‌ సోరెన్‌ను హస్తం పార్టీ ఇప్పటికీ వెనకేసుకు రావడం ఆశ్చర్యపరుస్తోందన్నారు. అవినీతికి పాల్పడిన నేతను వెనకేసుకొస్తున్నారంటే ఆ పార్టీ వైఖరి ఎంటో ప్రజలకు అర్థమవుతోందని విమర్శించారు. ఝార్ఖండ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్ చట్టబద్ధంగానే వ్యవహరించారన్నారు. 2018లో కాంగ్రెస్‌ నేతలు సంతకాల ఫోర్జరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని అడగడం కేవలం కాంగ్రెస్‌కే చెల్లిందని, అది భాజపా వల్ల కాదని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని