Mamata Banerjee: ఇందిరాగాంధీ చంద్రుడి వద్దకు చేరుకున్నప్పుడు..! మరోసారి తడబడిన మమత

భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3(chandrayaan 3) ప్రయోగం విజయవంతమైంది. దీని గురించి మాట్లాడుతూ పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మరోసారి తడబడ్డారు.

Updated : 29 Aug 2023 12:21 IST

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee) మరోసారి తడబాటుకు గురయ్యారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారంటూ వ్యాఖ్యానించి నెట్టింట ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇటీవల భారత అంతరిక్ష సంస్థ(ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 విజయం గురించి వెల్లడిస్తూ.. ఆమె ఇదే తరహాలో మాట్లాడిన సంగతి తెలిసిందే.

టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం గురించి మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సోవియట్ యూనియన్‌కు చెందిన రాకెట్‌లో భారత్‌కు చెందిన రాకేశ్‌ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, దీనిపై తడబడిన దీదీ.. ‘ఇందిరా గాంధీ చంద్రుడి వద్దకు చేరుకున్నప్పుడు.. అక్కడి నుంచి హిందుస్థాన్‌ ఎలా ఉందని రాకేశ్‌ను అడిగారు. ప్రపంచంలోనే ఉత్తమంగా ఉందని ఆయన బదులిచ్చారు’ అంటూ మాట్లాడేశారు. వాస్తవానికి రాకేశ్‌ శర్మ వెళ్లింది అంతరిక్షంలోకి.. కానీ ఆమె మాత్రం చంద్రుడిపైకి అని ప్రస్తావించారు. అదీనూ ఇందిరాగాంధీ వెళ్లారని ప్రస్తావించడం గమనార్హం. దీంతో ఆమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవల చంద్రయాన్‌-3 విజయవంతమైన సందర్భంలో కూడా ఇలాగే మమత మాట్లాడుతూ.. రాకేశ్‌ శర్మ గురించి ప్రస్తావించారు. అయితే.. రాకేశ్‌ శర్మకు బదులు.. రాకేశ్‌ రోషన్‌ అని అన్నారు. దాంతో బాలీవుడ్ నటుడు, నిర్మాత రాకేశ్‌ రోషన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆయన ఫొటోతో నెట్టింట్లో మీమ్స్‌ హల్‌చల్‌ చేశాయి.

భళా ప్రజ్ఞాన్‌!

భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 (chandrayaan 3) ప్రయోగంలో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్ సురక్షితంగా దిగింది. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో  భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని