Mamata Banerjee: మీరు తల తీసేసినా.. డీఏ మాత్రం పెంచలేను..!

డీఏ పెంచాలంటూ ఉద్యోగులు చేస్తున్న నిరసనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) మండిపడ్డారు. ఇంకా పెంచడం తమ వల్ల కాదంటూ స్పష్టం చేశారు. 

Updated : 07 Mar 2023 11:01 IST

కోల్‌కతా: కరవు భత్యం(DA) పెంపు కోసం రాష్ట్ర ఉద్యోగులు చేస్తోన్న నిరసనపై పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు. కేంద్రంతో సమానంగా రాష్ట్రంలో కూడా డీఏను పెంచాలని ఉద్యోగులకు మద్దతుగా విపక్ష పార్టీలైన భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

‘వారు తరచూ డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతమున్నదానికంటే పెంచడం కుదరదు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పటికే అదనంగా మూడు శాతం డీఏ ప్రకటించాం. మీకు ఇంకా ఎంత కావాలి..? ఆ పెంపుతో మీరు సంతోషంగా లేకపోతే.. నా తల తీసేయండి’ అని మమత(Mamata Banerjee) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల బెంగాల్‌(West Bengal) ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అదనంగా మూడు శాతం డీఏ పెంపును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నుంచి ఇది అమలవుతుందని అందులో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డీఏతో సమానంగా తమకు ఇవ్వాలంటూ ఉద్యోగులు చేస్తోన్న నిరసనకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తుండటంపై మమత మండిపడ్డారు. ‘కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్ వేర్వేరు. వేతనంతో కూడిన ఇన్ని సెలవులను ఏ ప్రభుత్వం ఇస్తోంది? డీఏ కోసం రూ.1.79 లక్షల కోట్లు ఖర్చుచేశాం. 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం. మీరెందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు. మేం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. కానీ గ్యాస్‌ ధర చూడండి ఎంతుందో..? ఎన్నికల తర్వాత రోజే ధరలు పెరుగుతాయి’ అని ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని