Viral video: విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి

అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.

Published : 01 May 2024 00:04 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిల్‌కుమార్‌ అనే ఓ వ్యక్తి దిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న తన కుమార్తె ఉర్వి (36)ని 2016లో దిల్లీకి చెందిన కంప్యూటర్ ఇంజినీర్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొద్దికాలం తర్వాత వరకట్నం కోసం యువతిని అత్తమామలు, భర్త వేధించడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఎనిమిదేళ్లు హింసను భరించిన అనంతరం ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు వెలువడింది. న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది.

దీంతో యువతి తండ్రి ఆమె అత్తవారి ఇంటినుంచి బ్యాండ్‌ బాజాలతో ఊరేగింపుగా ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లాడు. “మేము మా కూతురిని పెళ్లి తర్వాత అత్తారింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాము. ఈ సంఘనటతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటినుంచి వారు కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకున్నాం. అందుకే వారిని మేళతాళాలతో ఆనందంగా ఇంటికి ఆహ్వానించాము’’ అని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. కష్ట సమయంలో కూతురికి తోడుగా ఉన్న ఆ తండ్రిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

గతంలోనూ జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న తన కూతురిని ఇలాగే మేళతాళాలు, బాణసంచా సందడితో పుట్టింటికి ఆహ్వానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని